Odela | ఓదెల, ఫిబ్రవరి 20 : రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచుకోవాలని కోరారు. రైతులు పాడి పశువులకు కృత్రిమ గర్భాధారణ సూదులు వేసుకోవడం ద్వారా అధిక పాల దిగుబడి పెరుగుతుందన్నారు. అలాగే మేలు జాతి దూడలు జన్మిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు నిమ్మా నాయక్, ఉపసర్పంచ్ గుగులోతు లింగేశ్ నాయక్, ఓదెల పశు వైద్యాధికారి మల్లేశం, వార్డు సభ్యులు, పశు వైద్య సిబ్బంది మునిందర్, అగ్నివేస్, నాగరాజు, గోపాలమిత్రలు శ్రీపతి మహేష్ గౌడ్, శ్రీనివాస్, ఓదెలు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.