Korutla | కోరుట్ల జూలై 27 : తక్కువ నీటితో సాగుచేసే మెట్ట పంటల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుట్ల మండల వ్యవసాయ అధికారిణి నాగమణి పేర్కొన్నారు. కోరుట్ల మండలంలోని ఐలాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్ నినో వర్ష భావ పరిస్థితులలో మెట్ట పంటల సాగుపై రైతులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటలను ప్రాధాన్యంగా సాగు చేయాలని తెలిపారు.
పెసలు, మినుములు, కందులు, సోయాబీన్, వేరుశనగ, జొన్న, పొద్దు తిరుగుడు వంటి పంటలు తక్కువ నీటితో మెరుగైన దిగుబడిని అందిస్తాయని పేర్కొన్నారు. వీటి సాగుతో పెట్టుబడి భారం తగ్గడంతో పాటు రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఆమె వివరించారు. ఐలాపూర్ రైతు వేదిక లో 3 రోజుల పాటు విత్తనా మేళా ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చీడ పీడల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అంజిరెడ్డి గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఏఈవో శ్రీహరి, ఫామీన, అనిల్, నవిత, రైతులు పాల్గొన్నారు.