పంటలకు మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం మంచిది కాదు..
విత్తనాలు, ఎరువుల కొనుగోలు సందర్భంలో ఖచ్చితంగి రశీదులు తీసుకోవాలి..
కూనారం వ్యవసాయ పరిశోధనా క్షేత్రం శాస్త్రవేత్త శ్రీధర్ సిద్దీ, అధికారులు..
రాంపల్లి రైతు వేదికలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం
Peddapally | పెద్దపల్లి రూరల్, జూన్ 11 : రైతులంతా మారుతున్న పరిస్థితులకనుగుణంగా వ్యవసాయంలో అధికారుల సూచనలను సలహాలను పాటిస్తూ ఆధునిక పద్దతుల్లో సాగు విధానాలను అవలంభిస్తూ ముందుకు సాగితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని కూనారం వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త శ్రీధర్ సిద్దీ అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాంపల్లి రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు- అన్నదాతల అవగాహన పేరుతో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూనారం పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త శ్రీధర్ సిద్ది, ఉద్యానవన శాఖ, వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ.. వానా కాలం, యాసంగీ పంటల సాగులో సమతుల ఎరువులు, పురుగుమందుల వాడకంపై అవగాహన కల్పించారు. ప్రధానంగా యూరియా వాడకాన్ని చాలా తగ్గించాలని తెలిపారు. అవసరం ఉన్నంత మేరకే పురుగుమందులు వాడాలన్నారు. దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనేటప్పుడు తప్పనిసరిగా కొనుగోలు చేసిన విత్తనాలు, మందులు, ఎరువులకు రసీదులు తీసుకోవాలన్నారు. పంటలకు సాగునీటి వాడకాన్ని కూడా మోతాదు పద్దతుల్లోనే వాడాలని, పంట మార్పిడి పద్ధతుల వల్ల భూమిలో సారం తగ్గకుండా అధిక లాభాలు ఉండే విదంగా అధికారుల సూచనల మేరకు నడుచుకుంటే సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చన్నారు.
ఉద్యానవన శాఖ అధికారి మహేష్ మాట్లాడుతూ.. పామాయిల్ పంటల సాగుపై రైతులందరూ దృష్టి సారించాలన్నారు. ఉద్యానవన పంటల సాగుకు అవసరమైన పరికరాలు బిందు సేద్యం సబ్సిడీపై వస్తాయని ఈ అవకాశాలను వినియోగించుకుని రైతులు లాభసాటి వ్యవసాయం కోసం కృషి చేయాలన్నారు.
మండల వ్యవసాయ అధికారి కాంతాల అలివేణి మాట్లాడుతూ.. రైతులు పంట నమోదు కార్యక్రమాలు, రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమఫలాలు అర్హులైన రైతులందరు వినియోగించుకుని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక చేసుకుని , విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల, పురుగు మందులు వాడకం పై విపులంగా రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విస్తీర్ణాధికారి ప్రశాంత్, పరిసర గ్రామాల రైతులు పాల్గొన్నారు.