కోనరావుపేట : ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం రైతులు నిరసన( Protest) తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధాన్యం ( Grains) రాశులను దహనం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో అజ్మీరా తండాలోని రోడ్డుపై ధర్నా చేసి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి పాలనపై అవగాహన లేక రైతులు రోడ్డెకుతున్నారన్నారు. వరి కోతలు కోసి నెలలు గాడుస్తున్న పట్టించుకున్న నాథుడే కరువయ్యారన్నారని ఆరోపించారు.
ధాన్యం తూకం వేసినా బస్తాలు తరలించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వడ్ల రాశులు కొనుగోలు కేంద్రంలో పేరుకుపోతున్నాయన్నారు. మరో వైపు వర్షాలు కురిసి వడ్లు తడిసి ముద్దవుతున్నాయని పేర్కొన్నారు. అవగాహన లేని సీఎంతో రైతులకు ఈ దుస్థితి నెలకొంటున్నదని మండిపడ్డారు. రాస్తారోకోతో సుమారు రెండు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రశాంత్ రెడ్డి రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు.