ముస్తాబాద్, ఫిబ్రవరి 21 : మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తర్వాత దిగువన ఉన్న నక్కవాగుకు వదిలి పంటలను కాపాడాలని పలు గ్రామాల రైతులు శుక్రవారం మండలకేంద్రంలో ఎండలో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నక్కవాగు పరిసర గ్రామాలైన పోతుగల్, గన్నెవానిపల్లె, నర్సింహులతండా, మామిండ్లవారిపల్లె, నిమ్మలవారిపల్లె, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామాల రైతులు తాము వేసిన వరి పంట నీరు లేక వాడి పోతున్నదని, పొలం పగుళ్లు చూపుతున్నాయని, వెంటనే నీరందించకుంటే పశువుల మేతకు వదలాల్సి వస్తుందని వారం రోజుల నుంచి అధికారులకు విన్నవిస్తూ వస్తున్నారు.
దీనిపై నీటి పారుదల శాఖ అధికారులు శుక్రవారం ముస్తాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ముస్తాబాద్, పోతుగల్, పరిసర గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ముస్తాబాద్‌కు చెందిన నాయకులు, రైతులు మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తర్వాత దిగువకు వదలాలని పట్టుబట్టడంతో అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన రైతులు సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వచ్చి అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించారు.
దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్థానిక తహసీల్దార్ సురేశ్ కుమార్ అక్కడికి రాగా, మల్లన్నసాగర్ నుంచి వచ్చే నీటిని దిగువకు వదిలి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు. దీనిపై తహసీల్దార్ నీటి పారుదలశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మల్లన్నసాగర్ అధికారులతో మాట్లాడి ముస్తాబాద్ పెద్ద చెరువులోకి మూడు రోజుల్లో ఎక్కువ నీరు వచ్చేలా చూస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నీరు ఆలస్యమైతే పంటలు చేతికందవని, త్వరగా వచ్చేలా చూడాలని ఈ సందర్భంగా రైతులు వేడుకున్నారు.