అకాల వర్షాలతో అన్నదాతలు గోస పడుతున్నరు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం కండ్ల ముందే తడిసిపోయి.. కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక కండ్ల నీళ్లు పెడుతున్నరు. మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో భరోసానివ్వాల్సిన ఉమ్మడి జిల్లా మంత్రులు ఇప్పటి వరకు కనీసం కన్నెత్తి చూడలేదు. రైతన్న వద్దకు వచ్చి తామున్నామనే ధైర్యం ఇవ్వలేదు.
తడిసిన ధాన్యం కొంటామంటూ అమాత్యులు ప్రకటనలకు మాత్రమే పరిమితం కాగా.. ఇటు అధికారులు చాలా చోట్ల చేతులెత్తేస్తున్నారు. మరోవైపు వడ్లను వెంటనే కొనాలంటూ పలు చోట్ల రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులపై మంత్రులు కనీసం సమీక్షలు కూడా చేయకపోవడం అన్నదాతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు అద్దం పడుతున్నది. ఇక ఇన్చార్జి మంత్రి ఆరునెలలుగా ఉమ్మడి జిల్లా ముఖమే చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్ మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓవైపు అకాల వానలు.. మరోవైపు కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం పది రోజుల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా రోడ్డెక్కుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. చాలా చోట్ల నేరుగా ఆందోళనలకు దిగుతూ.. కనిపించిన వారినల్లా వేడుకుంటున్నారు. అయినా, పట్టించుకునే వారు కరువయ్యారు. ఉమ్మడి జిల్లా మంత్రులున్నా క్షేత్రస్థాయిలో భరోసానిచ్చేవారే లేకపోయారు.
నిజానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా మంత్రులు అందుబాటులో ఉంటూ.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. కొనుగోళ్లలో ఇటు అధికారులకు, అటు రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించాలి. జిల్లా స్థాయిలోనూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. అన్ని విభాగాలు, శాఖలను ఒకే తాటిపైకి తెచ్చి ఇటు కొనుగోళ్లు, అటు ట్రాన్స్పోర్టుతోపాటు మిల్లర్లతోనూ ఇబ్బందులు లేకుండా చూడాలి. ఈ బాధ్యత మంత్రులదే అయినా ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచి నేటి వరకు ఏనాడు కూడా ఈ విషయంపై అధికారులతో సమీక్షించిన దాఖలాలు లేవు. మొన్నటి వరకు ఎన్నికలు అనుకుంటే.. ఎన్నికలయ్యాక కూడా అదే పరిస్థితి! ప్రస్తుతం సమీక్షా సమావేశాలు పెట్టడానికి పెద్దగా ఇబ్బందులు ఉండవు.
Farmers Dharna
ఒకవేళ ఉన్నా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా అనుమతి తీసుకోవచ్చు. కానీ, ఆ దిశగా మంత్రులు ఎవరూ అడుగులు వేయడం లేదు. పోనీ ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నా.. రైతుల దగ్గరకు వెళ్లి తామున్నామనే భరోసా ఇవ్వడం లేదు. ఇన్చార్జి మంత్రి పరిస్థితి అంతే. గతేడాది డిసెంబర్లో ఒకసారి మీటింగ్ పెట్టి వెళ్లారంటే.. తిరిగి నేటి వరకు ఇటువైపు ముఖం చూడలేదు. ఆయన కూడా అధికారులతో సమీక్షిస్తూ దిశానిర్దేశం చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా అసలు జిల్లా ఇన్చార్జి మంత్రి ఎవరో తెలియని పరిస్థితి ఉన్నది.
మొన్నటి వరకు ఎన్నికల కారణంగా అధికారులు కొనుగోళ్ల ప్రక్రియపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఎక్కడ లోపం జరిగినా ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువగా ఫోకస్ పెట్టనట్టు కనిపించింది. ఫలితంగా మార్కెట్‌కు ధాన్యం తెచ్చిన తర్వాత కూడా రైతులు పదిహేను ఇరవై రోజులపాటు కొనుగోళ్లకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. చాలా చోట్ల ధాన్యం కుప్పులు పేరుకుపోయినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మూడు రోజులుగా ఆకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నా కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వెంటవెంటనే కాంటా కావడం లేదు.
దీంతో చాలాచోట్ల ధాన్యం వర్షానికి తడిసి పోతున్నది. వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నది. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలున్నాయంటూ వాతావారణ శాఖ చెబుతుండగా.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక.. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతూ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా, కొనుగోళ్లలో స్పీడ్ పెరగడం లేదు. అంతేకాదు, తడిసిన ప్రతిగింజా కొంటామని చెబుతున్న మంత్రులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం ఎందుకు పెడింగ్‌లో ఉంటుందో మాత్రం చెప్పలేకపోతున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసేదే నిజమైతే.. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు కొనచ్చు కదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా అన్నదాతల ఇబ్బందులు, అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని.. వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వస్తున్నది. కరీంనగర్ జిల్లాలో 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 2.20 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. ఇంకా దాదాపు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నది. అందులో 25 నుంచి 30 శాతం బయట మార్కెట్లో విక్రయాలు జరిగినా మిగిలింది కొనుగోలు చేయాలి. ఈ ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. సిరిసిల్లలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, 2.03 లక్షలు కొనుగోలు చేశారు.
పెద్దపల్లి జిల్లాలో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 2.30 లక్షలు కొనుగోలు చేశారు. ఇంకా 0.50 లక్షల టన్నులను కొనుగోలు చేయాల్సి ఉన్నది. జగిత్యాల జిల్లాలో 6.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినా,, అందులో 3.84 లక్షల మెట్రిక్ టన్నల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని లెక్కకట్టారు. ఇప్పటివరకు 2.85 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. ఇంకా 98,698 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉ్నది. అంటే, ఏ జిల్లాలో చూసినా వేలాది టన్నుల ధాన్యం కొనాల్సి ఉన్నది. ఇప్పటికైనా మంత్రులు సమీక్షలు నిర్వహించి.. ఇటు అధికారులు, అటు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడంతోపాటు కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉన్నది.