మల్కపేట కాల్వ నీళ్ల్లు వస్తాయనే నమ్మకంతో ఈ సారి పంట వేసిన తిమ్మాపూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నమ్మినందుకు నట్టేట మునిగే ప్రమాదం ఏర్పడింది. కాలువలో నీళ్లు రాక, బోరు బావుల్లో నీళ్లు లేక, వరుస తడుల అందించలేక పంటలు ఎండిపోయే దుస్థితి రాగా, రైతులు లబోదిబోమంటున్నారు. కాలువకు నీళ్లస్తాయని అధికారులు, స్థానిక నాయకులు చెబితే పంటలు వేశామని, ఇలా అయితదని అనుకోలేదని వాపోతున్నారు. కండ్ల ముందే పంటు ఎండిపోయే పరిస్థితి ఉన్నదని, సాగునీరిచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 8: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్లోని మైసమ్మ చెరువు పారకానికి సంబంధించి తిమ్మాపూర్ నుంచి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ శివారు వరకు సుమారు వంద ఎకరాల పొలం ఉంటుంది. గతేడాది అక్కపల్లి, అల్మాస్పూర్, రాజన్నపేట, దేవునిగుట్ట తండా, బాకుర్పల్లి వరకు మల్కపేట కాలువ ద్వారా సాగునీరు విడుదల చేశారు.
అయితే, ఈయేడాది తిమ్మాపూర్ గ్రామానికి కూడా నీళ్లు వస్తాయని అధికారులు, కొందరు స్థానిక నాయకులు చెప్పడంతో రైతులు ఆశతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేశారు. తీరా సమయానికి కాలువలోకి నీళ్లు వదలకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. కొంతమంది బోర్ల నుంచి వరుస తడులు పెడుతూ పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు నెల పాటు నీళ్లందిస్తే పంట చేతికి వస్తుందని, లేదంటే ఎండిపోయే ప్రమాదముందని ఆవేదనగా చెబుతున్నారు.
రెండు నెల్ల సంది కాలువ నీళ్లు వస్తయని అధికారులు అంటే రెండెకరాల్లో నాటేసిన. ఇప్పుడేమో పొలం పొట్టకు వచ్చింది. బోరు పెట్టి వరుస తడులు పారిద్దామంటే నీళ్లు ఎల్లుతలేవు. ఇంకో న్లైతే పంట చేతికొస్తది. నీళ్లు లేక ఇప్పటికే అద్ద ఎకరానికి ఎక్కువ ఎండిపోయింది. ఇప్పటికైనా అధికారులు నీళ్లిస్తే మా ఊళ్లో నూరు, నూటయాభై ఎకరాల పంటపొలాలు చేతికొస్తయి. లేదంటే అవికూడా ఎండిపోతయి.
– కొలకాని శంకర్, రైతు (తిమ్మాపూర్)
నాకు నాలుగెకరాల పొలం ఉండేది. అందుల రెండెకరాలు మల్కపేట కాలువకే పోయింది. మిగిలిన రెండెకరాలైనా పండుతదనుకుంటే నీళ్లు వస్తలేవు. ఈ యేడాది నుంచి కాలువలో నీళ్లొస్తయని చెబితే నేను రెండెకరాల్లో నాటేసిన. పొలం పొట్టకు వచ్చింది. బాయిల నీళ్లు ఎల్లుతలేవు. వరుస తడులు పెట్టి పారిద్దామంటే ఎవరూ నీళ్లు ఇత్తలేరు. 20, 30 గుంటల చేను ఎండిపోయింది. ఇప్పటికే 50వేల పెట్టుబడి పెట్టిన. అది మీద పడెటట్టు ఉన్నది. దయచేసి కాలువ ద్వారా నీళ్లిచ్చి మమ్మల్ని ఆదుకోండి.
– భూక్యా రాములు, రైతు (తిమ్మాపూర్)