Electricity problems | బోయినపల్లి రూరల్, జనవరి 9 : విద్యుత్ సరఫరాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకే రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బోయినపల్లి మండల సెస్ ఏఈ గాదపాక ప్రశాంత్ అన్నారు. బోయినపల్లి మండలంలోని విలాసాగర్ లో సెస్ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
లూజు లైన్లతో ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు, అలాగే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందుతుందా లేదా అనే అభిప్రాయాలను తెలుసుకోవడానికి రైతు పొలం బాట ఉపయోగపడుతున్నాయన్నారు. విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రతీ రైతు విద్యుత్ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని సూచించారు. రైతులు సొంత ప్రయోగాలకు పోకుండా విద్యుత్ సమస్యలపై అందుబాటులో ఉన్న విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏడీఈ సీ అనిల్ కుమార్, విద్యుత్ సిబ్బందితో పాటు రైతులు పాల్గొన్నారు.