కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్, నల్లగుంటపల్లి, మందులపల్లి, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాల్లో కాలువల ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన ఆయా గ్రామాల రైతులు బుధవారం కలెక్టర్‌ను కలిసి మొర పెట్టుకున్నారు. గంగాధర మండలం నారాయణ పూర్ రిజర్వాయర్ ద్వారా గుండి చెరువు నుంచి ఇరుకుల్ల వాగులోకి నీటిని విడుదల చేయాలన్నారు.
తక్షణమే నీటిని విడుదల చేస్తే తప్పా తమ పంటలు దక్కవని రైతులు కలెక్టర్ పమేలా సత్పతికి విన్న వించారు. ఈ గ్రామాల పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని D-89 కాలువ ద్వారా నీళ్లు వస్తాయని, ఇప్పటి వరకు నాలుగు విడతలు నీటిని విడుదల చేసినా తమకు నీళ్లు రాలేదని రైతులు వాపోతున్నారు. వాగు ఒడ్డుకు ఉన్న బావులు, బోర్లు పూర్తిగా ఎండిపోయాయని, పంటలు దక్కే పరిస్థితి లేదని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.