ఇల్లంతకుంట/బోయినపల్లి రూరల్, జూలై 16: శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేరు) ద్వారా సాగునీరు అందించండి మహా ప్రభో.. అంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కూర్, బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ రైతులు గురువారం రోడ్డెక్కారు. ఈ మేరకు ఇల్లంతకుంట మండలం పొత్తూరులోని మానేరు బ్రిడ్జిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మిడ్‌మానేరులో నీరు ఉన్నా.. విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.
మిడ్‌మానేరుకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా తమ గ్రామాలకు సాగునీరు లేకుండా పోయిందన్నారు. ఇసుక రవాణాతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయాయని ఆగ్రహించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తే ఈ ప్రాంతమంతా పచ్చని పైరుతో కళకళలాడేదని.. కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియా కారణంగా వానకాలంలోనే ఎడారిని తలపిస్తోందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కన్నెపల్లి పంపుహౌస్ వద్ద మోటర్లు ఆన్‌చేసి మిడ్‌మానేరుకు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఐరెడ్డి గీతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్నం శ్రీనివాస్, చెరుకుపల్లి రాజిరెడ్డి, రమేశ్, అనిల్, వెంకన్న, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రవీందర్, కొమురయ్య, అంజి, రైతులు పాల్గొన్నారు.