న్యూఢిల్లీ : కరెంట్ షాక్‌తో గాయపడ్డా లేదా మరణించినా పరిహారం కోరవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. కరెంట్ షాక్‌లకు విద్యుత్తు సరఫరా సంస్థలు, ప్రసార సంస్థలే బాధ్యత వహించాలని తెలిపింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నోంగ్మీకపామ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కర్ణాటక హైకోర్టు రెండు కేసుల్లో ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ రాష్ట్ర పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అందులో మొదటి కేసు.. 2018లో కర్ణాటకకు చెందిన ఎన్ సుబ్రమణ్య అనే వ్యక్తి తన పొలంలో పనులు చేస్తుండగా అల్యూమినియం నిచ్చెన 11కేవీ వైర్లకు తాకి అతను చనిపోయాడు. అతని భార్య రూ.25,52,500 పరిహారం కోరుతూ పిటిషన్ వేయగా డివిజన్ బెంచ్ సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.
మరో కేసులో ముయిజ్ అహ్మద్ షరీఫ్ పక్కింటి మీద క్రికెట్ బాల్ తీయడానికి వెళ్లినప్పుడు 66కేవీ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి రూ.44,32,050 పరిహారం ఇవ్వాలని హైకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. ఈ రెండు కేసుల్లో జరిగిన ఘటనలు వివాదాల్లో ఉన్నాయని.. తాము డబ్బులు ఇవ్వలేమంటూ కేపీటీసీఎల్ సుప్రీంలో పిటిషన్లు వేసింది. అత్యున్నత ధర్మాసనం విచారణ సందర్భంగా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హైకోర్టులకు రిట్ పిటిషన్ల అధికారాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థించింది.