చిగురుమామిడి, ఆగస్టు 12: చిగురుమామిడి మండలంలో (Chigurumamidi) యూరియా కొరత వేధిస్తున్నది. రైతుల తమకు కావలసిన యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ ఎరువుల కేంద్రం వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తుంది. ఉదయం 7 గంటలకే చిగురు మామిడి, ఇందుర్తి వ్యవసాయ పరపతి సహకార కేంద్రాల ఎరువుల దుకాణాల వద్ద రైతులు చేరుకొని పడిగాపులు కావలసిన పరిస్థితి నెలకొంది.
ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ వర్షం లెక్కచేయకుండా మహిళలతో పాటు రైతులు గొడుగులతో క్యూలో ఎరువుల కోసం నిలుచున్నారు. యూరియా కావలసినంతగా రాకపోవడంతో వచ్చిన యూరియాను తీసుకెళ్లినందుకు ఇందుర్తిలో వర్షానికి తట్టుకోలేక క్యూ లైన్లో నిల్చోలేక వరుస క్రమంలో చెప్పులు పెట్టి నిరీక్షించారు. పంటలకు సరిపడా యూరియా తెప్పించడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా సింగిల్ విండో కార్యాలయ సీఈవో నర్సయ్య మాట్లాడుతూ రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదని, మంగళవారం ఇందుర్తికి 680, చిగురుమామిడికి 444, రేకొండకు 230 బస్తాలు యూరియా బస్తాలు రావడం జరిగిందన్నారు. కొందరు రైతులు యూరియా దొరకదని అవసరానికి మించి రైతులు తీసుకెళ్లడంతో కేంద్రాలలో యూరియా దొరకడం లేదన్నారు. రైతులకు కేంద్రాల వద్ద యూరియా ఎప్పటికి అందుబాటులో ఉంటుందని అసత్య ప్రచారాలు నమ్మవద్దని సీఈఓ నర్సయ్య రైతులను కోరారు.