కోనరావుపేట, మే 5 : ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపు మండి ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి బైఠాయించారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి, గోవిందరావుపేట తండాలో సోమవారం రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ధాన్యం పది శాతం కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమేఘాల మీద సెంటర్ను ప్రారంభించి ఇప్పటివరకు అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడా సమర్థవంతంగా జరగడం లేదని విమర్శించారు. సెంటర్లలో ఉన్న ధాన్యం తేమ శాతం ఆరు, ఏడు వస్తుందని, దీంతో తూకంలో తరుగు వచ్చి రైతులమంతా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.
సాయంత్రం వేళలలో ఉరుములు, ఈదురుగాలలు వీయడంతో కేంద్రాల్లో ఉన్న రైతులు “అయ్యో.. దేవుడా కాపాడు” అంటూ వేడుకుంటున్నట్లు కన్నీటిపర్వంతమయ్యారు. రైతుల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం ఇంత దారుణంగా చూడడం సరికాదని మండిపడ్డారు. మరో వైపు తూకం వేసిన ధాన్యం 6 వేలకు పైగా బస్తాలు నిల్వ ఉన్నాయని, లారీల కోసం లక్ష్మారెడ్డి అనే కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే మరో రెండు నెలల దాకా ధాన్యం తరలించవచ్చని నిర్లక్ష్యపు సమాధానం చెపుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదిహేను రోజులు గడిస్తే వర్షాలు పడుతాయని, అప్పుడు ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇక సన్నపు వడ్లు కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు మిల్లులను కేటాయించలేదని తెలిపారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలకు క్షేత్రస్థాయిలో వెళ్లి రైతుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పోలీసులు చేరుకుని రైతులను నచ్చజెప్పి ధర్నాలను విరమింపజేశారు.
నాకున్న ఎనిమిది ఎకరాల్లో వరి సాగు చేసిన. దాదాపు వరి కోసి రెండు నెలలు కావస్తంది. ఈసారి ఆలస్యంగనే సెంటర్ ప్రారంభించిన్రు. వడ్లు సరిగా కొంటలేరు. మా సెంటర్ల జోకిన రెండు వేల బస్తాలు ఇప్పటివరకు తరలించలేదు. లారీలు సక్కగ రాక కొనుడు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అధికారులను అడిగితే లారీలు ఖాళీ అవుతలేవని చెప్తున్నరు. కలెక్టర్ సారూ, ఎమ్మెల్యే సారూ వడ్లు తొందరగా కొనేలా చేయండి.
మా ఊళ్లె సెంటర్ ప్రారంభించి న్లైతున్నా ఇప్పటి వరకు పది శాతం వడ్లు కూడా తరలించలేదు. తూకం వేసిన బస్తాలు ఎక్కడివక్కడ నిలిచిపోయినయ్. లారీలు రాక రైతులమంతా ఇబ్బందులు పడుతున్నం. సాయంత్రం వర్షం పడితే బస్తాలు తడిసి తరుగు వచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం వడ్ల కొనుగోలుపై చిన్నచూపు చూడడం సరికాదు. మరో పదిహేను రోజులైతే వర్షం పడే అవకాశాలున్నయ్. ఇక సెంటర్ల పోసిన ధాన్యపు రాశులను ఎప్పుడు తరలిస్తరు.