రైతులకు యూరియా తిప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎగిలివారకముందు నుంచే విక్రయ కేంద్రాల వద్ద ఎదురు చూపులు చూస్తున్నారు. గంటల కొద్దీ నిరీక్షించినా బస్తాలు మాత్రం దొరకడం లేదు. క్యూలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నా అందకపోవడంతో నిరాశతో ఇండ్లకు వెళ్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియా తెప్పించడంలో విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిమ్మాపూర్, సెప్టెంబర్13: మండలంలోని పొరండ్ల సొసైటీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి ఎరువుల విక్రయ కేంద్రం వద్ద పొద్దుగాలనే రైతులు బారులు తీరారు. చివరకు సరిపడా బస్తాలు లేక రైతులు నిరాశతో వెనుదిరిగారు. నుస్తులాపూర్ సొసైటీ వద్ద రైతులు మబ్బుల నుంచే లైను కట్టారు. 12 గంటల వరకు వేచి ఉన్నా ఒక్కొక్కరికి ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారు. అనేక మంది నిరాశతో వెళ్లారు. పది రోజుల కింద ఒక్కొక్కరికి 2 టోకెన్లు ఇవ్వగా అందులో ఒక్క బస్తా మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 13: రైతుల యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. రైతు జేబుకు చిల్లు పెడుతున్నారు. బస్తాపై అదనంగా రూ.43 వసూలు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం యూరియా పంపిణీ చేశారు. రైతుకు రెండు బస్తాల చొప్పున 220 మందికి 440 బస్తాలు అందజేశారు. అయితే బస్తాకు రూ.267 తీసుకోవాల్సిన నిర్వాహకులు అదనంగా రూ.43 అంటే బస్తాకు రూ.310 వసూలు చేశారు. తమ అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇంత దోపిడీకి పాల్పడడం సరికాదని రైతులు బహిరంగంగానే విమర్శించారు. చివరికి 38 మందికి యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు.
సైదాపూర్, సెప్టెంబర్ 13 : వెన్కేపల్లి -సైదాపూర్ సింగిల్‌విండోకు యూరియా వస్తుందన్న సమాచారంతో రైతులు తెల్లవారుజాము నుంచే ఎదురు చూశారు. తమ లైన్ ఎక్కడ పోతుందో అని చెప్పులను క్యూలో పెట్టారు. రైతులు ఎక్కువగా ఉండడంతో ఎస్ఐ తిరుపతి అక్కడకు చేరుకుని సహకార సిబ్బందితో మాట్లాడారు. 670 బస్తాలు రాగా, ఉదయం 8 గంటలకు ఏఈఓలు, సిబ్బంది గతంలో టోకెన్లు తీసుకున్న వారికి ఒక్కో బస్తా అందించారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 13: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని ఎక్స్‌రోడ్‌లో గల నేరెళ్ల సింగిల్‌విండో గోదాం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజామునే చేరుకున్నారు. 450 యూరియా బస్తాలు రాగా, సుమారు 600 మంది రైతులు బారులు తీరారు. రోజంతా పడిగాపులు కాశారు. పోలీసు పహారా మధ్య ఒక్కో రైతుకు ఒక బస్తా పంపిణీ చేయగా, 150 మంది వెనుదిరిగారు. జిల్లెల్ల ఎక్స్‌రోడ్‌లోని గ్రోమోర్ దుకాణంలో 550 యూరియా బస్తాలు రాగా, ఉదయాన్నే సెంటర్‌కు చేరుకొని క్యూలో వేచి ఉన్నారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా మాత్రమే అందజేయడంతో సుమారు 200 మంది వెనుదిరిగారు. గంటల తరబడి యూరియా బస్తాల కోసం వేచి ఉండడంతో మహిళ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలోని జిల్లా రైతు వేదికలో ఒక బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో సుమారు 200 మంది నిరాశ చెందారు. అధికారులు, నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
వేములవాడ, సెప్టెంబర్ 13: వేములవాడ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణంలోకి 340 యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో రైతులు ఉదయాన్నే 4 గంటలకే వచ్చి బారులు తీరారు. లైన్లో నిల్చునే ఓపిక లేక క్యూలో చెప్పులు, బండ రాళ్లు, ఆధార్ కార్డులను పెట్టి పడిగాపుకాశారు. అయితే ఇదివరకే ఆధార్ కార్డుల ఆధారంగా టోకెన్లు తీసుకున్న 300 మందికి ఒక బస్తా చొప్పున అందజేసినట్లు వ్యవసాయ అధికారి రాజు తెలిపారు. శనివారం వచ్చిన దాదాపు 300మంది రైతుల ఆధార్ కార్డులు తీసుకున్నామని, మళ్లీ లోడ్ రాగానే ఇస్తామని వివరించారు. కాగా, గంటల తరబడి లైన్లో నిల్చున్న రైతులు కన్నెర్రజేశారు.
సుల్తానాబాద్, సెప్టెంబర్ 13: సుల్తానాబాద్ పీఏసీఏస్ గోదాంకు శనివారం రెండు లారీల్లో 540 బస్తాలు రావడంతో 500మందికి పైగా రైతులు తరలివచ్చారు. క్యూ కట్టారు. రోజంతా నిరీక్షించారు. అయితే పోలీసుల పహారాలో ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 270 మందికి పంపిణీ చేయడంతో రానివారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 230 మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేండ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని, బీఆర్ఎస్ సర్కారు సాగుకు ముందే సరిపడా యూరియా అందించిందని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవుసాన్ని పట్టించుకోవడం లేదని, యూరియా చల్లే టైం దాటిపోయిందని, పంటకు పెట్టిన పెట్టుబడి కుడా వస్తదో రాదో అని ఆవేదన చెందారు.