Urinary Tract Infection | మన శరీరం అప్పుడప్పుడు పలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటుంది. వాటిల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. దీన్నే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా యూటీఐ అంటారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, జననావయవాల దగ్గర పరిశుభ్రత పాటింకపోయినా, అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను లేదా పబ్లిక్ టాయిలెట్లను ఎక్కువగా వాడినా, మెనోపాజ్ వచ్చిన మహిళల్లో, డయాబెటిస్, కిడ్నీ స్టోన్లు వంటి సమస్యలు ఉన్నవారిలో, గర్భిణీలకు, వయస్సు మీద పడిన వారికి తరచూ మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ సమస్య పురుషుల కన్నా స్త్రీలకే అధికంగా ఉంటుంది. అయితే మూత్రాశయ ఇన్ఫెక్షన్ అనేది తీవ్రమైన అనారోగ్య సమస్య కాదు. కొన్ని రోజుల పాటు మందులను వాడితే సరిపోతుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉంటే శరీరం పలు సంకేతాలను, లక్షణాలను తెలియజేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో పెల్విక్ భాగంలో నొప్పిగా ఉంటుంది. మహిళల్లో సాధారణంగా ఈ నొప్పి అధికంగా ఉంటుంది. అలాగే తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. రాత్రి పూట ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి ఉంటాయి. కొన్ని సార్లు కొందరికి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. ఇక పురుషుల్లో అయితే మల విసర్జన చేసే సమయంలో లేదా మల ద్వారం వద్ద నొప్పిగా ఉంటుంది. మూత్రం పోసేటప్పుడు దుర్వాసన వస్తుంది. కొందరిలో జ్వరం, చలిగా అనిపించడం, వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉందని తెలియజేసే లక్షణాలుగా భావించవచ్చు.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉన్నవారు డాక్టర్ ఇచ్చిన మేర క్రమం తప్పకుండా మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీని వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. త్వరగా కోలుకుంటారు. మూత్ర సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉంటే రోజూ అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. లేదా కొన్ని రోజుల వరకు మానేస్తే మంచిది. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఇక మూత్రం పదే పదే వస్తుందని ఎక్కువ సేపు బందించకూడదు. అలాగే మూత్ర విసర్జన లేదా మల విసర్జన చేసిన తరువాత కచ్చితంగా అవయవాలను శుభ్రంగా కడుక్కోవాలి.
మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి పలు ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉండే ఆహారాలను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. నిమ్మజాతికి చెందిన పండ్లను అధికంగా తినాల్సి ఉంటుంది. ఇవి మూత్రాశయానికి మేలు చేస్తాయి. ఇన్ఫెక్షన్లను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. క్రాన్ బెర్రీలు, దానిమ్మ పండ్లు, గ్రీన్ టీ, కివి, పైనాపిల్, బొప్పాయి వంటి ఆహారాలు, పండ్లను తీసుకుంటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. అలాగే రోజూ ఉదయం పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటున్నా ఉపయోగం ఉంటుంది. దీని వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. మూత్ర సంబంధిత వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.