Errolla Srinivas | రాష్ట్ర ప్రభుత్వం ఇల్లీగల్‌గా కేబినెట్ నడుపుతోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశామని తెలిపారు. ఇష్టమొచ్చినట్లుగా 16 మందిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఢిల్లీకి మూటలు మోసే వారికి కూలోళ్లను పెట్టుకుంటే సరిపోతుంది కదా.. 16 మంది సలహాదారులు ఎందుకు అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. అప్పులు పుట్టడం లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. ఇలా ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. రాజ్యాంగ హక్కులను కాపాడతానని సార్వత్రిక ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పాడని గుర్తుచేశారు. మరి ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు పాలన చేస్తున్నాడని ప్రశ్నించారు. కేబినెట్‌కు సమానంగా 16 మంది ప్రభుత్వ సలహాదారులతో రహస్య కేబినెట్‌ను రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా నియమించిన 16 మంది అడ్వైజర్లను తొలగించాలని కోర్టులో పిల్ దాఖలు చేశామని తెలిపారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేందుకు ఐఏఎస్ అధికారులను కేసీఆర్ సలహాదారులుగా పెట్టుకున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టాడని.. అధికార దుర్వినియోగం అవుతుందని మాట్లాడాడని అన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు నచ్చినట్లుగా 16 మందిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నారని అన్నారు.
ఓటుకు నోటు దొంగ వేం నరేందర్ రెడ్డిని సైతం ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారని అన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు వేసి , కోర్టుకు వెళ్లారని గుర్తుఏసిన ఆయన.. ఇవాళ మిమ్మల్ని కూడా కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. దోపిడి దొంగలను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారని.. దీని మీద కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మంత్రులుగా సమర్థులు కారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని జగదీశ్ రెడ్డి అన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం ఇది అని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.