అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్య రంగం (Medical Sector ) పై అవలంభిస్తున్న విధానం వల్ల పేద ప్రజలు( Poor People) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) ఆరోపించారు.
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రైవేట్‌పరం చేసి లబ్ధిపొందాలనే చంద్రబాబు దుర్భుద్ది బయటపడుతుందని విమర్శించారు. ప్రజారోగ్యం ప్రభుత్వ చేతుల్లో ఉండాలే తప్ప ప్రైవేట్ చేతుల్లో పెట్టడం పేదలకు న్యాయం జరుగదని అన్నారు.
పీపీపీ విధానంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సంతకాల రూపేణా సేకరించి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు వెల్లడించారు. అందుకోసం గురువారం గవర్నర్‌ను కలిసి సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీని అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తుండగా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ హయాంలో కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం పేదవాళ్లు వైద్య విద్య చదువాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలో మెడికల్ కళాశాలలను మంజూరు చేశారని గుర్తు చేశారు. వీటిలో 5 కళాశాలలు పూర్తికాగా మరో 12 కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రారంభించారని తెలిపారు. జగన్ ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుర్భుద్దితో మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు.