Peddapally | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 18: సన్న వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న బోనస్ రైతులకు చాలా మేలు జరుగుతుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని నారాయణరావుపల్లి, సాంబయ్య పల్లి, గొల్లపల్లి , ఐతరాజు పల్లి, భూపతిపూర్, బొంతకుంటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. అలాగే గర్రెపల్లి ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరామరావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు కటింగ్ లేకుండా చూడడం మా అందరి బాధ్యత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించిన పనులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతు పక్షపాతి అన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.కోటి 42 లక్షలతో సీసీ రోడ్ల కోసం మంజూరైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్లు జూపల్లి సందీప్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, డీపీఎం నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం గీత, సీఈవోలు నబి ఉద్దీన్, సంతోష్, శంకరయ్య, నాయకులు వెంకన్న, జానీ, సతీష్, వెంకన్న పటేల్, వెంకటేశం, ఎల్లారెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు. అలాగే నీరుకుల గట్టపెల్లి ,కదంబ పూర్, తొగరాయి గ్రామాల్లో సుల్తానాబాద్ కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించనున్నారు.