మల్లాపూర్, జూలై 28: ఈ ఫొటోలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిల్చుండి చూస్తున్న వారు రైతులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఈ 100 కేవీ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ ఈ ఒక్క నెలలోనే రెండు సార్లు కాలిపోయింది. దీంతో దీని పరిధిలో ఉన్న 20 మంది రైతులు మోటర్లు నడుపుకోలేక అవస్థలు పడుతున్నారు. గత 18 రోజుల క్రితం ఒకసారి కాలిపోగా రైతులు విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పది రోజుల కిందట దానిని తొలగించి వేరే ట్రాన్స్ఫార్మర్ను బిగించారు.
అది కూడా మళ్లీ కాలిపోయింది. దీంతో విసుగు చెందిన సంబంధిత రైతులు ఆదివారం ట్రాన్స్ఫార్మర్ ఎదుట నిలబడి తమ సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ విషయమై విద్యుత్‌శాఖ ఏఈ వినీత్‌రెడ్డిని వివరణ కోరగా సమస్య వాస్తవమేనని సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దకు సిబ్బందితో కలిసి వెళ్లి అన్ని రకాలుగా పరిశీలించామని, త్వరితగతిన వేరే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.