కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 8: యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సింగిల్విండో కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్ మండలం దుర్శేడ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో నిల్వలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా మూసే ఉండడంతో ఆయా గ్రామాల నుంచి తరలివస్తూ నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. తమకు తెలిసిన వారని సొసైటీ పరిధిలో లేని గ్రామాల రైతులకు డైరెక్టర్లు యూరియా బస్తాలు ఇప్పించడం, మరోవైపు అధికారులు యూరియాకు సంబంధించిన డిపాజిట్లు ముందస్తుగా పంపించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొరత ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో సొసైటీలో స్టాక్ ఫుల్గా ఉండేదని, పాలక వర్గంలో వచ్చిన మార్పులు, ముందస్తుగా స్టాక్ తెప్పించడంలో నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై సీఈవో వేణును వివరణ కోరగా, ముందస్తుగా డిపాజిట్ చేయకపోవడం వల్ల స్టాక్ రావడంలో జాప్యం జరుగుతున్నదని, సొసైటీ నుంచి నాలుగు రోజుల కింద పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ రైతులు యూరియా తీసుకెళ్లారని చెప్పారు.