Farmers | ఇల్లందకుంట జూన్ 16: ఖరీఫ్ సీజన్లో రైతన్నలు పంటల సాగు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు విత్తనాలు నాటేందుకు భూమిని దున్నుకొని, పంట సాగులో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వం పంట సాగు కోసం రైతుబంధు కిందట పంటల పెట్టుబడికి ఫసలుకు ఒక్కంటికి ఎకరాన రూ.5000 చొప్పున ఖాతాలో జమ చేయడంతో సాగు సజావుగా కొనసాగేది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు పంట సాగు కోసం ఎన్ని ఎకరాలు సాగుచేసిన ప్రతీ ఎకరానికి రూ.6వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఆచరణలో మాత్రం కొనసాగడం లేదు. కేవలం నాలుగు ఎకరాలలోపు సాగు చేసిన రైతులకు మాత్రమే రూ.6వేలు జమ చేసి చేతులు దులుపుకుంది. దీంతో నాలుగు ఎకరాల పైబడి సాగుచేసిన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం అందక నిరాశలో ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు భూములను చదును చేసుకొని పంటల సాగుకు సిద్ధమయ్యారు.
పంట పెట్టుబడి సహాయం అందకపోవడంతో విత్తనాల కొనుగోలు భారంగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నుంచి పంట భరోసా అందకపోవడంతో విత్తనాల కొనుగోలు కోసం అప్పులు చేసే పరిస్థితి దాపురించిందని రైతులు కన్నీరు పర్యవంతమవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు అంది పంట సాగు పండగలా సాగితే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పూర్తిస్థాయిలో పంట సాగు చేయలేక నానా ఇక్కట్లను పడుతున్నామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 750 ఎకరాలలో పత్తి, 50 ఎకరాలలో మొక్కజొన్న, 1200 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా ప్రస్తుతం పంట పెట్టుబడి సాయం అందక కొంతమంది రైతులు మాత్రమే సాగుకు సిద్ధం కాగా, మిగిలిన రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారు.
పంట సాగు చేస్తున్న రైతులందరికీ భరోసా అందించాలి : కంకణాల రవీందర్ రెడ్డి, రైతు
నాకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడి సహాయం అందేది. పెట్టుబడికి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసేవాళ్లం. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతీ రైతు ఖాతాలో జమ చేయాలి. అప్పుడే సజావుగా ఎవుసం సాగుతది.
నాలుగెకరాల భూమి ఉన్నా.. రైతు భరోసా రాలే.. : ఉడుత వీరస్వామి, రైతు మల్యాల
నాకు నాలుగెకరాల భూమి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.6వేల చొప్పున ఇస్తామని హామీ ఇవ్వడంతో సంతోషం అనిపించింది. కానీ గత యాసంగి సీజన్లో ప్రభుత్వం నాలుగు ఎకరాల వరకు మాత్రమే పంట పెట్టుబడి ఇచ్చింది. కానీ నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్న నాకు పంట పెట్టుబడి అందలేదు. అధికారులను అడిగితే ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో పంట పెట్టుబడి అంది సాగుకు ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు పంట సాగు కష్టంగా ఉందని, వెంటనే ప్రభుత్వం ప్రతీ రైతుకు పంట సాగు సాయం అందించి భరోసా అందించాలి.