రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ)/ కోనరావుపేట/ గంభీరావుపేట/ ఎల్లారెడ్డిపేట : పాడి రైతులు కన్నెర్రజేశారు. అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై భగ్గుమన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పాలసేకరణ నిలిచిపోగా, రైతులు ఎక్కడికక్కడ రోడ్డెక్కారు. సెంట్లర ముందు, రోడ్లపై పాల డబ్బాలతో బైఠాయించారు. తమ పాలను కరీంనగర్ డెయిరీలో పోస్తామని, తీసుకునే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదంటూ అక్కడే బైఠాయించారు. కోనరావుపేట మండలం మామిడిపల్లి, కోనరావుపేట, మల్కపేట, కనగర్తి, ధర్మారం, నిజామాబాద్, వేములవాడ రూరల్ మండలం అనుపురం, ఇల్లంతకుంట మండలంలోని రేపాక, సోమారంపేట గ్రామాలతోపాటు గంభీరావుపేట మండలకేంద్రంలో పాలను పారబోసి నిరసన తెలిపారు. అంతటా అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినదించారు. 145 గ్రామాల్లోని సుమారు 20వేల మంది పాడి రైతులకు అండగా ఉంటున్న మిల్క్ చిల్లింగ్ కేంద్రాన్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే సీజ్ చేయడం సరికాదని ధ్వజమెత్తారు. 20 ఏండ్ల నుంచి రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న సెంటర్‌ను సీజ్ చేసిన పాపం ఊరికేపోదని నిప్పులు చెరిగారు.
35వేల లీటర్ల పాలను సేకరించే చిల్లింగ్ సెంటర్‌ను సీజ్ చేసి తమ ఉపాధిని దెబ్బతీశారంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం, అధికారయంత్రాంగం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలకు ఇది నిదర్శంగా నిలుస్తున్నదని మండిపడ్డారు. తమపై ఇలా ప్రతాపం చూపడం సరి కాదని, వేలాది కుటుంబాలకు అండగా ఉంటున్న కేంద్రానికి చేయూతనివ్వాల్సింది పోయి ఇలా వ్యవహరించడం ఎంతమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే అధికారులు ఈ పాపానికి ఒడిగట్టారన్న ఆరోపిస్తున్నారు. నిజంగానే కేంద్రానికి ఏవైనా అనుమతులు లేకపోతే నోటీసులు ఇచ్చి డెయిరీ నిర్వాహకులకు సమయం ఇవ్వాలని, స్పందించని పక్షంలో చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా ఎకాఎకిన సీజ్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చిల్లింగ్ కేంద్రం సీజ్వల్ల వేలాది మంది రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చినా అధికార పార్టీ నాయకులు కనీసం నోరెత్తకపోవడంపై ఆగ్రహిస్తున్నారు. పాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న తమపై ప్రభుత్వం కర్కశత్వంగా వ్యవహరిస్తున్నదని మండిపడుతున్నారు. సీజ్ చేసిన సెంటర్‌ను వెంటనే తెరిపించాలని, లేని పక్షంలో ప్రతి గ్రామంలోని రైతులందరం కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అగ్రహారంలో రైతులు మూడుగంటల పాటు ఆందోళన చేయగా, పోలీసులను పెట్టి విరమింపజేశారు. కానీ, సాయంత్రం పాలకేంద్రాల వద్ద మెజార్టీ గ్రామాల రైతులు ఆందోళనతో హోరెత్తించారు. ప్రభుత్వం, అధికారులతోపాటు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగే శుక్రవారం ఆందోళన మరింత తీవ్రం చేయాలని, కలెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. ఆ మేరకు అన్నీ పాడి సహకార సంఘాలకు సమచారం ఇచ్చారు. సీజ్ చేసిన చిల్లింగ్ సెంటర్‌ను తెరిచే వరకు కలెక్టరేట్ నుంచి కదలొద్దని నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆందోళన ఉగ్రరూపం దాలుస్తుందన్న విషయం తెలియడంతో అధికారులు దిగొచ్చారు. అధికార పార్టీ నాయకులు.. కలెక్టర్‌తో మాట్లాడగా, రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ సమక్షంలో పంచాయతీ కార్యదర్శి సీజ్‌ను తొలగించి, చిల్లింగ్ సెంటర్‌ను ఓపెన్ చేశారు అయితే రైతుల ఆందోళన తీవ్రమైతే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెస్తుందన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది ఇలాగే కొనసాగిస్తారా.. లేక రైతుల ఉద్యమం చల్లారగానే, మళ్లీ సీజ్ చేస్తా రా..? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.
నేను పదిహేనేండ్ల సంది కరీంనగర్ పాల డెయిరీ పాలకేంద్రంల పాలుపోస్తున్న. నాకు రోజుకు సుమారు రూ.వంద వస్తయ్. ఇన్నేండ్ల చరిత్రల ఇప్పటివరకు ఎప్పుడూ పాలు బయట అమ్ముకోలే. నాకు తెలిసి మొదటిసారి కేంద్రానికి పాలు తీసుకువచ్చి తిరిగి ఇంటికి తీసుకుపోతున్న. మాలాంటి రైతుల పొట్టకొట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి తెలిసింది మరొకటి లేదు. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తంది తప్ప ఎక్కడా మేలు చేసింది లేదు.
నేను పాలను కేంద్రంలో అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. డెయిరీ వాళ్లు కూడా టైంకు డబ్బులు ఇస్తున్నరు. కానీ, కరీంనగర్ డెయిరీ సీజ్ చేసి మా పొట్ట కొట్టిన్రు. ప్రభుత్వం ఏదైనా సమస్య ఉంటే వారు వారు చూసుకోవాలి. ఇలా డెయిరీ సీజ్ చేసి పాల రైతుల పొట్టకొట్టడం సరికాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి.
కరీంనగర్ డెయిరీలో పాలు పోస్తున్న పాడి రైతులకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ డెయిరీ అండగా నిలుస్తున్నది. పాడి రైతు కుటుంబాల పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు, ఫలితాలపై ప్రోత్సాహక ఆర్థికసాయం, వృద్ధులకు పింఛన్లు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు పుస్తె మట్టెలు, పాడి గేదెల అభివృద్ధికి రాయితీ రుణాలు, గడ్డి పెంపకం, రాయతీపై పశువులకు దాణా, సంపూర్ణ ఆరోగ్యానికి అత్యవసర వైద్యసేవలను అందిస్తున్నది. విక్రయిస్తున్న పాలకు సరసమైన ధరను కూడా ఇస్తున్నది. ఇంత మంచిగా సేవలందిస్తున్న డెయిరీని మూసేయడం దారుణం. విజయ డెయిరీలో మేం పాలు పోయనే పోయం. మీరు పాలు పోయాలని చెప్పడం సిగ్గు చేటు. రైతులపై కక్షపూరిత చర్యలు వద్దు. మా పొట్ట కొట్టద్దు. ఇలానే చేస్తూ పోతే మేం ఊరుకోం.
కరువు కాలంలో పాలమీద బతుకుతున్నం. పాడి రైతుల బతుకుదెరువుకు దెబ్బతీస్తే ఊరుకునేదిలేదు. పాల కేంద్రాలు వెంటనే షురూ చేయాలి. రైతుల పొట్టమీదకొడితే ఏం వస్తది. కాయకష్టం చేసి పాలు అమ్ముకునే రైతుమీద ప్రతాపం చూపొద్దు. ప్రభుత్వం స్పందించి వెంటనే పాలు కొనాలి.
మేం కొన్నేండ్లుగా కేంద్రంల పాలు పోస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నం. ఇప్పటికే మేం వేసిన పంటలు పండుతాయా.. లేదా? అని రోజూ బోరుబావుల వద్ద కాచుక కూర్చుంటున్నం. ఇప్పుడు పాలమీద బతుకుతున్న నాలాంటి పేద రైతులు పొట్టకొట్టే పనులు చేస్తున్నరు. అధికారులు మా రైతుల బతుకుల మీద కోపాన్ని చూపొద్దు. వెంటనే పాల సేకరణ జరపకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తం.
ఇప్పుడు డెయిరీ శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేస్తే ఎలా? విజయ డెయిరీలో పాలు అమ్ముకోవాలని చెబితే ఎట్లా? మేం కొన్నేండ్ల సంది మేం కరీంనగర్లో డెయిరీలో పాలు పోస్తున్నం. ఇప్పుడు ఆ కేంద్రాన్ని సీజ్ చేసి పాడి రైతులను రోడ్డున పడేసింది. ఇది సరికాదు. ఇట్లయితే ప్రభుత్వానికి మేం తగిన గుణపాఠం చెబుతం.
నేను కొన్నేండ్ల నుంచి పాలమ్ముతున్న. ఎప్పుడే గిట్లగాలె. రోజు పొద్దుగాల రెండు లీటర్లు.. మాపటీలు రెండు లీటర్లు పాలమ్ముత. ఇప్పుడు ఈడికి రాంగనే పాలు కొనుడు బంజేసినం అంటున్నరు. కలెక్టర్ అగ్రహారంల పాల కేంద్రాన్ని మూయించిండని చెపుతున్నరు. మా రైతుల కోసం పాల కేంద్రం ఉన్నది. దీన్ని ఇట్ల బంజేసుడేంది అర్థమైతలేదు. పొద్దుగాల ఏడికి రమ్మంటే ఆడికి పోతం అడుగుతం ఇట్లెందుకు జేసిన్రని.