సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 30 : కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పైపులైన్లో నష్టపోయిన భూమితోపాటు మిగతా భూములకు సంబంధించిన మొత్తం పట్టాలు గల్లంతయ్యాయని, ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లో చేర్చి, ఈ పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వీర్నపల్లి మండలంలోని రైతులు సోమవారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అంతకు ముందు ఛలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా ప్రజాసంఘాల నాయకుడు మల్లారపు అరుణ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయకుడు మల్లారపు అరుణ్‌కుమార్, రైతులు మాట్లాడుతూ, పైప్‌లైన్‌లో నష్టపోయిన భూమితో పాటు మిగతా భూమికి సంబంధించిన పట్టా వివరాలు ఆన్లైన్లో కనిపించకుండా చేసి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కలెక్టర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ధర్నాలో రైతులు పిట్ల నాగరాజు, రాజేశం, దేవయ్య, నర్సయ్య, శంకర్, రాజాం, లింబయ్య, అనిల్, అంజయ్య, రాములు, తదితరులు పాల్గొన్నారు.
గల్లంతైన రైతుల పట్టాలను ఆన్లైన్లో వెంటనే పునరుద్ధరించాలి. ఇదే విషయమై ధర్నా చేసి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి వినతిపత్రం అందించాం. బాధిత రైతుల ఖాతాల్లో యధావిధిగా రైతు భరోసా డబ్బులు జమ చేయాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో నా భూమి పోయింది. నా భూమి నుంచి పైపులైన్ కోసం అరెకరం తీసుకున్నరు. అది కాకుండా మిగిలిన భూమి కూడా హోల్డ్‌లో పెట్టిన్రు. అది ఆన్లైన్లో కనిపించడం లేదు. దీనివల్ల ప్రభుత్వం ద్వారా రావాల్సిన రైతు భరోసా, ఇతర పథకాలు అమలు కావడం లేదు. మిగిలిన భూమిని హోల్డ్ నుంచి తొలగించి పథకాలు అమలయ్యేలా చేయాలి. రైతు భరోసా డబ్బులు కలెక్టర్ సార్ ఇప్పించాలి.
నా భూమి పైపులైన్ కోసం తీసుకున్నరు. ఇందులో కొంత భూమి పోగా మిగిలిన భూమిని కూడా హోల్డ్‌లో పెట్టి పథకాలు రాకుండా చేస్తున్నరు. మిగిలిన భూమిని హోల్డ్ నుంచి తొలగించి రైతు భరోసాతో పాటు ప్రభుత్వం పథకాలు అమలయ్యేలా చూడాలి.