రుణమాఫీ విషయంలో సర్కారు ధోఖాపై ఉమ్మడి జిల్లా రైతులు ఆగ్రహించారు. మూడు విడుతలుగా ప్రకటించిన జాబితాల్లో పేర్లు లేక పోవడంపై ఆందోళన బాట పట్టారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షలు వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి తీరా అమలులో ఆంక్షలు పెడుతుండడంపై మండిపడ్డారు. రోడ్లపైకి చేరుకుని రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళనబాట పట్టిన రైతులకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. పలు చోట్ల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మెట్పల్లిలో పలువురు రైతులను బలవంతంగా లాక్కెళ్లి రాస్తారోకోను విరమింపజేసి ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఓ రైతు తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, కథలాపూర్ రైతు వేదిక వద్ద మరో రైతు పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు.
కథలాపూర్, ఆగస్టు 20 : కథలాపూర్ మండలం భూషణ్రావుపేటకు చెందిన ఏనుగు సాగర్‌రెడ్డికి 1.51,800 పంట రుణం ఉన్నది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటున్నాడు. మూడు విడుతల్లోనూ అది మాఫీ కాలేదు. ఇటు సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మానసికంగా ఆందోళన చెందాడు. మంగళవారం కథలాపూర్‌లో రైతులతో ధర్నాలో పాల్గొన్నాడు. నాయకులు ప్రసంగిస్తుండగానే.. రుణమాఫీ చేయకపోతే తాను చనిపోతానంటూ నినదించాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుల నివారణ మందును తాగేందుకు యత్నించాడు. అక్కడున్న రైతులతోపాటు ఎస్ఐ నవీన్‌కుమార్ అప్రమత్తమై, రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బా లాక్కెళ్లారు.
మెట్పల్లి, ఆగస్టు 20 : మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ‘రైతులేనిదే రాజ్యం లేదు, ఇచ్చిన హామీలను అమలు చేయాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచుతారా? అని ప్రశ్నిస్తూనే గెలిపించిన రైతులే రాబోయే రోజుల్లో బొందపెడతారని హెచ్చరించారు. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా అటు బ్యాంకు అధికారులు, ఇటు వ్యవసాయాధికారులు చెప్పిందే చెబుతున్నారు తప్ప తమ రుణాలు మాత్రం మాఫీ కావడం లేదని, 2 లక్షలు కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించకుంటే మాఫీ చేయరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటకు పైగా రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చేవరకు లేచేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో పలువురు రైతులను బలవంతగా లాక్కెళ్లి రాస్తారోకోను విరమింపజేసి ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. కాగా, అప్పటికే అక్కడికి వచ్చిన జిల్లా వ్యవసాయాధికారి వాణికి రైతులు తమ డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు. ఇక్కడ రైతు సంఘం నాయకులు మారు మురళీధర్‌రెడ్డి, కందరి ప్రతాప్‌రెడ్డి, మారు సాయిరెడ్డి,గూడ రాంరెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, పీసు తిరుపతిరెడ్డి, ఆకుల ప్రవీణ్, ఆకుల రాజారెడ్డి, బద్దం శేఖర్‌రెడ్డి, ఎలాల దశరథరెడ్డి,ఏనుగు గంగారెడ్డి, ఏలేటి ముత్తయ్యరెడ్డి, నోముల గంగాధర్, కాకర్ల రాజారెడ్డి, దోమకొండ చిన్న రాజన్న పాల్గొన్నారు.
కథలాపూర్, ఆగస్టు 20 : కథలాపూర్ మండలకేంద్రంలోని కోరుట్ల-వేములవాడ రోడ్డుపై పెద్ద సంఖ్యలో రైతులు ధర్నా చేశారు. ‘రుణమాఫీ పేరిట రైతులను దగా చేసిన కాంగ్రెస్ డౌన్ డౌన్’ ‘అబద్ధపు హమీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘దైవ ద్రోహనికి పాల్పడ్డ సీఎం డౌన్ డౌన్’ ‘ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి’ అంటూ రాసిన ప్లకార్డులను మహిళా రైతులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని తహసీల్దార్ ముంతాజిబొద్దీన్కు వినతిప్రతం ఇచ్చారు. ధర్నాలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య, నాయకులు పాల్గొన్నారు.
రైతులకు రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ముఖ్యమంత్రికి పాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలి. దేవుళ్లపై ప్రమాణం చేసి రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసం చేశారు. రైతు భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలి. పచ్చని పంట పొలాల మధ్య ఉండాల్సిన రైతులను రోడ్డు మీదకు తెచ్చిన కాంగ్రెస్ సర్కారుకు ఉసురు తగులుతుంది. సీఎం గాలి మాటలు చెప్పి రైతులను మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు.
ఆగస్టు 15 కల్లా రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామంటూ ఎక్కడికి వెళ్తే అక్కడి ప్రముఖ దేవుళ్లపై ఒట్లు పెట్టిండ్రు. అమలు సమయం వచ్చేసరికి మాట మారుస్తుండ్రు. కొంచెమైనా సిగ్గులేదా..? మాఫీకి ఇచ్చిన గడువు కూడా అయిపోయింది. కాలయాపన చేసేందుకు ఏవేవో కారణాలు చెబుతున్నరు. పట్టా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు, అవసరమైన పత్రాలు సక్రమంగా ఉంటేనే బ్యాంకు వాళ్లు లోన్లు ఇస్తరు. రుణమాఫీకి వచ్చేసరికి సాంకేతిక లోపం, ఇంకేవో సాకులు చెబుతూ రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నరు. భేషరతుగా రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
షరతులు లేకుండా భేషరతుగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఇప్పటి వరకు సగం మంది రైతులకు కూడా రుణమాఫీ జరగలేదు. రైతులను మోసం చేసన ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. హామీల అమలుకు వచ్చేసరికి ఏవేవో షరతులు పెట్టడం సరికాదు. రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రుణ మాఫీ సంపూర్ణంగా చేయాలి.
ఎన్నికలప్పుడు రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్తే రైతులు నమ్మి ఓట్లు వేసిన్రు. హామీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ లేదని తెల్వదా?, తీరా మాఫీ టైమ్ వచ్చేసరికి ఖజానా లేదంటూ కొర్రీలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్. ఇట్లజేత్తే గెలిపించిన రైతులే బొందపెట్టడం ఖాయం.