గోదావరిఖని, జూలై 21: సింగరేణి కార్మికులకు ఎనలేని సౌకర్యాలు, హక్కులు కల్పించి వారి గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. కార్మికుల హక్కుల సాధన టీబీజీకేఎస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర కొనసాగుతున్నదని, ఈ క్రమంలో సంస్థను కాపాడుకోవడానికి టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరంచారు.
త్వరలోనే కోల్‌బెల్ట్ ఏరియాలో కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేసి కార్మికులకు దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా సోమవారం రాత్రి గోదావరిఖనిలోని ఓ ఫంక్షన్హల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తనకు టీబీజీకేఎస్ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌కు కొప్పుల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సింగరేణి గని కార్మికుల పాత్ర కీలకమైందని, అందుకే కార్మికులు అంటే కేసీఆర్‌కు అమితమైన అభిమానమని చెప్పారు.
సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కృషితో అనేక అదనపు సౌకర్యాలు సమకూర్చామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్, తాజాగా టీబీజీకేఎస్‌ను వేధింపులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. కావాలనే యూనియన్ నాయకులను టార్గెట్ చేసి అక్రమ బదిలీలు చేస్తూ ఇబ్బందిపాలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఘాటుగా విమర్శించారు.
ఇప్పుడు జరుగుతున్న మీటింగ్‌కు కార్మికులు, కార్యకర్తలను రాకుండా నిర్బంధాలకు గురిచేసినా హాజరయ్యారని చెప్పారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సంస్థకు తొత్తుగా మారిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలను ఎండగడుతామన్నారు. నాయకులపై వేధింపులు ఆపాలని, అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 23న కోల్‌బెల్ట్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల ఆధ్వర్యంలో సింగరేణి సీఎండీని కలిసి అక్రమ బదిలీలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.
గోదావరిఖని మూడు దశాబ్దాల క్రితం రౌడీగా చెలామణి అయిన జాఫర్ జమానాను తలపించేలా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిపాలన కొనసాగుతున్నది. అన్ని అంశాల్లో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులను వేధిస్తున్నారు. సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో నిర్బంధాన్ని ఎదిరించి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ముందుకు సాగేందుకు కృషి చేస్తాం. కొప్పుల ఈశ్వర్‌కు ఇన్చార్జితో టీబీజీకేఎస్‌కు పూర్వవైభవం వస్తుంది.
– కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు. కావాలనే టీబీజీకేఎస్‌కు చెందిన ముఖ్య నాయకులను బదిలీలు చేశారు. ఎనలేని అనుభవం ఉన్న కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ ముందుకు సాగుతుంది. అధికార కాంగ్రెస్‌కు సరైన బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ అన్నదమ్ముల మాదిరిగా కలిసి పనిచేయాల్సి అవసరం ఉన్నది.
– పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్యే
సింగరేణి సంస్థను కాపాడే సత్తా బీఆర్ఎస్, టీబీజీకేఎస్‌కే ఉంది. కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. టీబీజీకేఎస్ ఇన్చార్జిగా కొప్పుల ఈశ్వర్‌ను నియమించడం మంచి పరిణామం. సింగరేణి కార్మికుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ఈశ్వర్ ఆధ్వర్యంలో ముందుకు సాగి కార్మికుల హక్కులను సాధిస్తాం. అక్రమ బదిలీలపై పోరాటం చేస్తాం.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు