ధర్మపురి, జూలై18 : నాలుగు నెలలుగా దమ్మన్నపేట ఎత్తిపోతల పథకం పనిచేయకున్నా పట్టించుకునే వారు లేరని ఆయకట్టు రైతులు ఆగ్రహించారు. అధికారులను అడిగితే రేపు మాపు బాగు చేయిస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ధర్మపురిలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.
బీఆర్ఎస్ పాలనలో మంత్రి ఈశ్వర్ చొరవతో దమ్మన్నపేట ఎత్తిపోతల పథకాన్ని 2023లో ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ముంబైకి చెందిన ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వం నుంచి మెయింటెనెన్స్ చార్జీలు తీసుకుంటూ ఏడేళ్ల కాలపరమితితో ఎత్తిపోతల పథకాన్ని నిర్వహిస్తున్నాడని తెలిపారు. మార్చిలో రెండు స్టార్టర్లు చెడిపోయాయని, అప్పుడు టెక్నీషియన్లు వచ్చి వాటిని ముంబైకి పంపించారని, కానీ, ఇప్పటి వరకు బాగు చేయించలేదని వాపోయారు.
అనంతరం మాజీ మంత్రి ఈశ్వర్‌ను కలిసి సమస్యను వివరించగా..నీటిపారుదల శాఖ ఈఎన్సీ మహ్మద్‌ఖాన్‌తో మాట్లాడారు. రెండు రోజుల్లో ఎత్తిపోతల పథకానికి మరమ్మతు పనులు చేయించి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇక్కడ నాయకులు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, దండవేని గంగమల్లయ్య తదితరులున్నారు.