గన్నేరువరం, మే 26: గత నెల రోజులుగా తమ వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతూ రోడ్డుపై బర్రెలను కట్టేసి రైతు దంపతులు నిరసనకుదిగారు (Protest). గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్‌లోని పెట్రోలు పంపు సమీపంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొరివి పోషయ్య, సుశీల దంపతులకు పొలం ఉన్నది. నెల క్రితం డబుల్ రోడ్డుపై కరెంటు స్తంభం విరిగిపోయింది. దీంతో వారి వ్యవసాయ బావికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీంతో మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్ధరించాలని గత నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని రైతు దంపతులు చెప్పారు. పని కావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ లేకపోవడంతో పశువుల నీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డబుల్ రోడ్డుపై బర్రెలను కట్టేసి నిరసన వ్యక్తంచేశామని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరను పునరుద్ధరించాలని కోరారు.