సంచారజాతుల (కోతులు ఆడించేవాళ్లు) 30 ఏండ్ల కల నెరవేరింది. మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు చొరవతో సొంతింటి స్వప్నం సాకారమైంది. నాటి కాంగ్రెస్ పాలనలో ఎవరూ పట్టించుకోకున్నా.. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 42 కుటుంబాలకు 2.20 కోట్లతో ఇండ్లు నిర్మించి అందించింది. తాజాగా అమాత్యుడు రామన్న చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయగా, సంచారజాతుల్లో ఆనందం వ్యక్తమైంది.
వేములవాడ రూరల్, ఆగస్టు 8 : 30 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం వేములవాడ మండలం రుద్రవరం గ్రామశివారుకు కోతులు ఆడించేవారు (సంచారజాతులు) వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సహకారంతో 15 కుటుంబాలకు పట్టాలను అందించారు. అప్పటి నుంచి అక్కడే నివాసముంటున్నారు. నాడు మిడ్‌మానేరు ప్రాజెక్టులో ముంపునకు గురికాగా, అప్పటి కాంగ్రెస్ పాలకులు వీరిని పట్టించుకున్న పాపానపోలేదు. వీళ్లుండే నివాసాల వరకు బ్యాక్‌వాటర్ వచ్చినా అక్కడే భయంభయంగా ఉండాల్సి వచ్చింది. అయినా ఎవరూ కనీస సాయం చేయలేదు. కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మిడ్‌మానేరు ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా, నిర్వాసితులకు న్యాయం చేసింది. అందులో భాగంగానే సంచారజాతికి చెందిన 42 కుటుంబాలకు రెండు గుంటల చొప్పున చింతల్‌ఠాణా ఆర్ఆర్అండ్ కాలనీలో స్థలం కేటాయించి, పట్టాలను అందజేసింది. తర్వాత మంత్రి కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు చొరవతో ప్రభుత్వం 42 కుటుంబాలకు 2.20 కోట్లు ఖర్చు చేసి డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మించింది. మంగళవారం మంత్రి అమాత్యుడు రామన్న, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేతుల మీదుగా గృహప్రవేశం చేయగా, సంచారజాతుల వాసులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమకు నీడను కల్పించిన ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు.
మా కల నేరవేరింది
మాకు ఉండేందుకు ఇల్లు లేదు. కనీసం జాగ కూడా లేదు. కోతులను ఆడించుకుంటూ ఏ ఊరుకు పోతే అదే ఊర్లో ఉండేటోళ్లం. మా సొంతూరు రుద్రవరం. మిడ్‌మానేరు డ్యాంల మునిగిపోయింది. మాకు ఈ గవర్నమెంట్ రెండు గుంటల భూమి ఇచ్చి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించింది. చాలా సంతోషంగా ఉంది. మా కల నెరవేరింది.
– రమ్య, చింతల్‌ఠాణా
ఎండకు ఎండి వానకు తడిసెటోళ్లం
మాది రుద్రవరం. మాకు ఇళ్లు లేకుండే. గుడిసెలో ఉండేటోళ్లం. ఎండకు ఎండి వానకు తడిచేటోళ్లం. మా ఊరు డ్యాంల పోయింది. కేసీఆర్ సారు మాపై దయతలచి ఇల్లు కట్టించిండు. మేం ఎప్పటికీ ఆ సారును మరిచిపోం. మేం ఇల్లు కట్టుకుంటామని ఎన్నడూ అనుకోలేదు. కేసీఆర్ సారు పుణ్యానా మాకు నీడ దొరికింది. నీడ ఇచ్చిన సారును మేం మరిచిపోం.
– శివ, చింతల్‌ఠాణా