జమ్మికుంట, జూన్14 : తన కూతురు బర్త్‌డే సందర్భంగా బట్టలు కొనేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడి కుటుంబ సభ్యులు లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. అరగంట సేపు అందులోనే ఉండి పోయి ఇబ్బంది పడి చివరకు ఎలాగోలా బయటపడ్డారు. బాధితుల కథనం ప్రకారం.. జమ్మికుంటలోని కృష్ణకాలనీకి చెందిన మద్దూరి శ్రీనివాస్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల చివరి వారంలో తన కూతురు పుట్టిన రోజు ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ బట్టల షా పులో షాపింగ్ చేసేందుకు భార్యా పిల్లలతో గురువారం రాత్రి వెళ్లాడు. రెండో ఫ్లోర్లో బట్టలు కొనుగోలు చేశాడు.
అనంతరం ఫ్లోర్లో ఉండే ఉద్యోగితో సహా వినియోగదారుడి కుటుంబ సభ్యులు లిఫ్ట్ ఎక్కారు. ఏం జరిగిందో.. ఏమో కొన్ని సెకండ్లలోనే లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో భయాందోళనకు గురై లిఫ్ట్‌లో అరిచారు. డోర్లను కొట్టారు. లిఫ్ట్ కిందకు వెళ్లలేదు. శ్వాసకు ఇబ్బంది పడ్డారు. దాదాపు అరగంటసేపు అందులో నే ఉండిపోయారు. అంతలోనే శ్రీనివాస్ ఫోన్ ద్వారా తన మిత్రులకు తెలుపడంతో.. వారు షాపులోని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు లిఫ్ట్ ఆగిందనే విషయం తెలుసుకున్నారు.
కాగా, లిఫ్ట్‌లో ఉన్న శ్రీనివాస్ ఏఎల్ఎం కావడంతో అప్పటికే తనకున్న పరిజ్ఞానంతో లిఫ్ట్‌ను రిపేర్ చేయగా, ఎట్టకేలకు అది మూవ్ అయి కిందకు వచ్చారు. లిఫ్ట్ నుంచి బయట పడడంతో శ్రీనివాస్ ఫ్యామిలీ, ఉద్యోగి ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ ఆగిపోవడంపై శ్రీనివాస్ కుటుంబసభ్యులు షాపు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్ట్ రిపేర్ కావడం.. వినియోగదారులు ఇబ్బంది పడడం ఇదేమీ కొత్త కాదని, గతంలోనూ ఇలాగే జరిగిందని అక్కడే ఉన్న వినియోగదారులు ఆరోపించారు.