కరీంనగర్ జిల్లాలో నకిలీ మందుల మూలాలు బయట పడ్డాయి. హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీకి చెందిన ఆథరైడ్జ్ మెడిసిన్ మరో కంపెనీ నుంచి రావడాన్ని గుర్తించిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు శనివారం కరీంనగర్‌లోని ఓ ఏజెన్సీలో సీజ్ చేయడం కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన సదరు అసలు ఫార్మా కంపెనీ ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. సీజ్ చేసిన మందులను సోమవారం కోర్టుకు అప్పగిస్తామని డ్రగ్ కంట్రోల్ ఏడీ మర్యాల శ్రీనివాసులు తెలిపారు. కమీషన్ కోసం కక్కుర్తి పడుతున్న కొన్ని ఏజెన్సీలు గుట్టుగా చేస్తున్నఈ దందా వెలుగులోకి రావడం సంచలనం రేగింది.
కరీంనగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కరీంనగర్లో నకిలీ మందుల దందా బయట పడింది. పెరాల్సిస్ వ్యాధిగ్రస్తుల కోసం తయారు చేస్తున్న లెవిపిల్-500 ఎంజీ ట్యాబ్లెట్స్ను అస్సోంకు చెందిన సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తోంది. ఇదే లేబుల్, ఇదే పేరుతో మరో కంపెనీ నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు, ఇవి కరీంనగర్లోనూ విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సన్ ఫార్మా కంపెనీకి చెందిన హైదరాబాద్‌లోని క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ (సీఎఫ్ఏ) నిర్వాహకులు ఈ విషయాన్ని గత ఏప్రిల్ 9న ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు మెడికల్ ఏజెన్సీల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
అందులో భాగంగా కరీంనగర్‌లోని వేణు ఏజెన్సీలో సన్ ఫార్మా కంపెనీ పేరుతో కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నట్లు గుర్తించి సదరు కంపెనీకి సమాచారం ఇచ్చారు. గత నెల 3న అస్సోం నుంచి కంపెనీ ప్రతినిధులు, హైదరాబాద్ నుంచి సీఎఫ్ఏ నిర్వాహకులు కరీంనగర్‌కు వచ్చి అధికారులు సేకరించిన మందులను పరిశీలించి, ఇవి తమ కంపెనీలో తయారైనవి కాదని తేల్చేశారు. అయితే, ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తమ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేశారు. వేణు మెడికల్ ఏజెన్సీలో దొరికిన లెవిపిల్-500కు, సన్ ఫార్మా కంపెనీకి సంబంధించిన లెవిపిల్-500 మందులకు సంబంధం లేనట్లు తేలింది. దీంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు వేణు ఏజెన్సీలో లభించిన 107 నకిలీ స్లిప్స్‌ను సీజ్ చేసినట్లు, ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు డ్రగ్స్ కంట్రోల్ ఏడీ శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ తెలిపారు. వీటిని సోమవారం కోర్టుకు అప్పగిస్తామని స్పష్టం చేశారు.
కమీషన్ల కోసమే కక్కుర్తి
అస్సోంలోని సన్ ఫార్మా కంపెనీకి చెందిన లెవిపిల్-500 ట్యాబ్లెట్స్ను అచ్చం వాటిలాగే తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్న తీరు కలకలం రేపింది. అయితే, ఇందులోనూ అసలు ట్యాబ్లెట్స్కు సంబంధించిన డ్రగ్స్ ఫార్ములా ఉన్నట్లు అధికారుల పరీక్షల్లో తేలింది. తాము పరీక్షించిన వాటిలో ఉన్నప్పటికీ అన్ని ట్యాబ్లెట్స్‌లో ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒక ఫార్మా కంపెనీకి ఆథరైజ్డ్ చేసిన ఫార్ములాను మరో కంపెనీ తయారు చేయడం నేరంగానే పరిగణిస్తారు. అయితే, పెరాలసిస్ వచ్చిన రోగులకు వాడడంలో ఈ మందులకు ఎక్కువ డిమాండ్ ఉంది.
మందులు బాగా పనిచేయడంతో వైద్యులు కూడా ఎక్కువ ఇవే మందులను రాస్తున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ ఉన్న ఈ మందులు ఎక్కడ తయారవుతున్నాయో ఇప్పటి వరకు అధికారులు తేల్చలేదు. కానీ, కమీషన్ ఎక్కువ ఉంటుందనే దురాశతో కొన్ని ఏజెన్సీలు ఇలాంటి మందులు తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 400లకు పైగా మెడికల్ ఏజెన్సీలు ఉన్నట్లు తెలుస్తుండగా పెద్ద మొత్తంలో ఇలాంటి దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం కమీషన్ల కోసమే ఇలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తున్న ఏజెన్సీలు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ఈ లెవిపిల్ ఎక్కడి నుంచి వచ్చింది?
కరీంనగర్లో వెలుగు చూసిన ఈ నకిలీ ట్యాబ్లెట్స్ దందా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు అందినప్పటి నుంచి తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లోని వేణు ఏజెన్సీ నిర్వాహకులు హైదరాబాద్‌లోని రాం మెడికల్ ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా తనిఖీలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అరవింద్ ఏజెన్సీని ఇది వరకే సీజ్ చేశామని వారు తెలిపారు.
తీగ లాగితే డొంక కదిలినట్లు దీని మూలాలు దేశ వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రాం, అరవింద్ ఏజెన్సీలకు కోల్కత్తా నుంచి, అక్కడికి ఉత్తరప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్‌కు బీహార్ నుంచి ఈ మందులు వచ్చినట్లు తెలుస్తోంది. బీహార్‌కు మరెక్కడి నుంచైనా వస్తున్నాయా, ఇక్కడే తయారవుతున్నాయా అనేది అధికారుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. కరీంనగర్లో శనివారం జరిగిన తనిఖీల్లో హైదరాబాద్‌కు చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు రాజిరెడ్డి, మురళీకృష్ణ, మంచిర్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ చందన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కేసులో కరీంనగర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ వ్యవహరిస్తున్నారు.
కరీంనగర్లో కలకలం
దేశంలోనే అత్యధికంగా మెడికల్ వ్యాపారం జరిగే కరీంనగర్లో నకిలీ మందులు లభించడం కలకలం రేగింది. ఇప్పుడు దొరికింది కొంత మాత్రమేనని, మెడికల్ వ్యాపారులు మాఫియాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సాగిస్తున్న ఈ దందాలో కరీంనగర్లో మూలాలు బయట పడడం సంచలనంగా మారింది. జిల్లాలో 400లకు పైగా మెడికల్ ఏజెన్సీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ఏజెన్సీలపై తరుచూ తనిఖీలు జరిగితే కొంత నియంత్రణలో ఉండేది.
కానీ, ఔషద నియంత్రణ శాఖలో ఒక ఏడీ, ఒక ఇన్స్‌స్పెక్టర్, ఒక క్లర్క్ పోస్టు మాత్రమే ఉన్నాయి. అధికారులు కూడా ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే తప్పా తనిఖీలు చేసే పరిస్థితి లేదు. దీంతో అనేక మెడికల్ ఏజెన్సీలు తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఇలాంటి దందా పెద్ద మొత్తంలోనే జరుగుతుందని, బయటికి వస్తే తప్ప తెలియదని ఇటు వైద్యుల్లోనూ చర్చ జరుగుతోంది. ఇలాంటి నకిలీ మందులు రోగులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఏ మందులు రాయాలో, ఏవి రాయకూడదో తెలియని గందరగోళ పరిస్థితిలో తామున్నామని కొందరు వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు.