వానకాలం సీజన్వేళ కరీంనగర్ జిల్లాలో నకిలీ ఎరువులు, విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. పలువురు అక్రమార్కులు అమాయక రైతులకు అంటగడుతూ నిండా ముంచుతుండడం కలవరపెడుతున్నది. ఇటీవల మొగ్దుంపూర్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేసి కోరమండల్ ప్రైవేట్ కంపెనీ పేరిట విక్రయించిన 21 నకిలీ ఎరువు బస్తాలను గుర్తించడం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది. అయితే ఎరువుల సూత్రధారిపై నామమాత్రపు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నట్టు, ఓ పార్టీ నాయకుడి ఒత్తిడితో చర్యలు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కర్షకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ రూరల్, జూలై 12 : పంటకు బలాన్ని ఇచ్చేందుకు సాగు మొదట్లో రైతులు కాంప్లెక్స్ ఎరువులు (అడుగు మందు) వేస్తుంటారు. ఇదే అదనుగా పలువురు డీలర్లు నకిలీ ఎరువులను అంటగడుతూ నిండా ముంచుతున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలోని కరీంనగర్, రామడుగు, గంగాధర మండల కేంద్రాలుగా నకిలీ ఎరువుల వ్యాపారం జోరుగా సాగుతున్నదని, అందులో ఓ ఫర్టిలైజర్ డీలర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఓ ప్రైవేట్ కంపెనీ నాలుగేళ్ల క్రితం ఉత్పత్తి నిలిపివేసిన ‘28-28-0’ కాంప్లెక్స్ ఎరువుల పేరిట రెండేళ్లుగా సదరు డీలర్ ఆయా మండలాల్లోని రైతులకు నకిలీ ఎరువులు విక్రయిస్తున్నాడు. ఈ రకం ఎరువులకు మార్కెట్లో బస్తాకు ధర రూ.2300 ఉంటుందని, తన వద్ద పాత స్టాక్ ఉందంటూ రూ.1800కు విక్రయిస్తూ అమాయక రైతులను నిండా ముంచుతున్నాడు. అయితే ఈ నకిలీ ఎరువులపై సమాచారంతో మూడు రోజుల కింద కరీంనగర్ మండల వ్యవసాయ అధికారి సత్యం మొగ్దుంపూర్లోని ఇద్దరు రైతుల ఇండ్లలో తనిఖీ చేసి, కోరమండల్ కంపెనీ పేరిట ఉన్న 21 నకిలీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ ప్రతినిధులు సైతం వచ్చి నకిలీ ఎరువులుగా గుర్తించగా, ఏవో సత్యం శ్యాంపిల్స్ సేకరించారు.
అనంతరం కరీంనగర్ రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే సదరు డీలర్‌ను కేసు నుంచి తప్పించేందుకు ఉన్నత స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు రావడంతో చర్యలు చేపట్టేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేయడంతో తమ పని అయిపోయినట్టు వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపం వల్ల నకిలీ ఎరువుల కేసు నీరుగారేలా కనిపిస్తున్నదని బాధిత రైతులు మండిపడుతున్నారు. గతంలో సైతం నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన మరో వ్యక్తిపై అధికారుల నిర్లక్యంగా వ్యవహరించి నామమాత్రపు కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తి కొద్దిరోజులకే బయటికి వచ్చి గత మే నెలలో మళ్లీ నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినట్టు తెలిసింది. అయితే, వర్షాలు లేక పోవడంతో ఆ విషయం బయటకు పోక్కడం లేదు. తాజాగా నకిలీ ఎరువులు విక్రయించిన వ్యక్తిపై యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఎరువుల కేసు నామమాత్రంగా ముగిసేలా కనిపిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కరీంనగర్ రూరల్ ఏవో సత్యంను సంప్రదించగా.. అవి నకిలీ ఎరువులని స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదైందని, కరీంనగర్, రామడుగు, గంగాధరతోపాటు మిగతా మండలాల్లోనూ విచారణకు అధికారులు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.