వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నా విత్తనాలు లభించక రైతులు నకిలీ విత్తన మాయగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాల్లోకి పంపించారు. ప్రస్తుతం పరిస్థితి తారుమారవడంతో కొందరు వ్యాపారుల నకిలీ విత్తన వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఆంధ్రా ప్రాంతం నుంచి రవాణా చేస్తూ విచ్చల విడిగా విక్రయిస్తున్నారు..
– కరీంనగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/రాంనగర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొందరు నకిలీ విత్తన వ్యాపారులకు అడ్డాగా మారింది. ఈ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి నకిలీ విత్తనాలు పెద్ద మొత్తంలో తెలంగాణ జిల్లాలకు చేరుతున్నట్లు అనేకసార్లు రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత హెట్టీ పత్తి విత్తనాల దందాకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో తెరతీశారు. అయితే, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఈ కేటుగాళ్ల ఆటలు సాగనివ్వలేదు. ఎక్కడ చిన్న మొత్తంలో నకిలీ విత్తనాలు లభించినా అక్రమార్కులపై క్రిమినల్ కేసులు బనాయించి జైళ్లకు పంపింది. దీంతో 2018 నుంచి 2020 వరకు ఈ దందాను దాదాపుగా అరికట్టింది. ఈ మూడు నాలుగేళ్లలో నకిలీ విత్తన వ్యాపారులు తెలంగాణ ప్రాంతానికి రావాలంటేనే హడలి పోయారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు మరోసారి చెలరేగుతున్నారు.
సీజన్ ప్రారంభం కాకముందే జిల్లాలకు పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు డంపు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా వ్యాపారుల కనుసన్నల్లో ఇక్కడి వారు కూడా ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మునుపటి మాదిరిగానే హెచ్‌టీ విత్తనాల పేరుతో గ్రామాల్లో దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. బీటీ-3 ఫార్ములాతో రూపొందించిన ఈ విత్తనాలు గడ్డి మందును తట్టుకుంటుందని అక్రమ వ్యాపారులు రైతులను నమ్మిస్తున్నారు. పత్తిలో గడ్డి మందు వాడితే జరిగే నష్టాలు అనేకం ఉన్నాయని ఈ విత్తనాలను గతంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అయినా, కొందరు వ్యాపారులు ఈ విత్తనాలను గుట్టుగా గ్రామాలకు తరలించి రైతులకు విక్రయిస్తున్నారు. వీటి ముసుగులో నకిలీ విత్తనాలను కూడా అమ్ముతున్నారని తెలుస్తోంది.
రైతులు సాగు చేసుకునే సమయం ముంచుకొస్తున్నా వారికి అవసరమైన విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడం సమస్యగా మారింది. యాసంగిలో పంటల దిగుబడి సరిగా లేక.. పెట్టుబడి సాయం అందకపోవడం.. సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు కొనుగోలుకు తంటాలు పడుతున్నారు. అయితే, డిమాండ్‌కు తగినన్ని విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేక పోవడంతో దళారులు కల్తీ విత్తనాల విక్రయానికి తెరలేపినట్లు తెలుస్తోంది. బీటీ విత్తనాలు అని నమ్మించి క్వింటాళ్ల కొద్దీ నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చి అంటగడుతున్నారని తెలుస్తోంది.
వర్షాలు అనుకూలిస్తే ఇప్పటికే చాలా మంది రైతులు పత్తిని విత్తుకునేవారు. నీటి సదుపాయం ఉన్న రైతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పత్తి విత్తుకుంటున్నారు. అయితే, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసిన కొందరు రైతులు మోసపోతున్నారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేయవద్దని వ్యవసాయ అధికారులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. కానీ, నకిలీ విత్తనాలు అమ్మే కేటుగాళ్ల మాయమాటలతో రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతున్నారు.
నకిలీ విత్తనాలపై నిఘా కరువవడంతో దళారుల నుంచి బెడద ఎకువైంది. గతంలో వేసవికాలం ముగుస్తున్న సమయంలోనే విత్తనాలను అందుబాటులో ఉంచడమే కాకుండా కల్తీ విత్తన విక్రయాలపై కఠిన వైఖరి ప్రదర్శించేవారు. విసృ్తతమైన తనిఖీలు నిర్వహించే వారు. కల్తీ విత్తనాలు ఉంటే కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. గతంలో రామడుగు, తిమ్మాపూర్, హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్ కేంద్రంగానూ ఈ దందా పెద్ద మొత్తంలో నడిచేది. గత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడంతో 2020 నుంచి అక్కడక్కడ మినహా ఈ దందా చేసేందుకు ఎవరూ సాహసించ లేదు. ప్రభుత్వం మారడంతో పరిస్థితులు మారిపోయాయి.
విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి సరైనవి అమ్ముతున్నారా? లేదా?, రికార్డులు సరిగా ఉన్నాయా? లేదా? అనేవి నిశితంగా పరిశీలించాలి. అయితే, వారు నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక కల్తీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులు పట్టుబడినట్టు కేసులు నమోదు చేశామని ప్రకటిస్తున్న పోలీసులు ఎలాంటి కేసులూ లేకుండానే వాళ్లను వదిలిపెట్టడంతో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు మరింత ఎకువయ్యాయి. దీనికి వారం రోజుల క్రితం కరీంనగర్, రామగుండం పోలీసు కమిషనరేట్ల పరిధిలో మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పట్టుబడిన నాగేశ్వర్ రావు ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఈ నెల 6న మంచిర్యాల జిల్లా భీమారంలో నివాసముంటున్న చందు నాగేశ్వరరావు అనే వ్యక్తి గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి 60 కేజీల నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తుండగా కరీంనగర్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇదే వ్యక్తిని తిరిగి రామగుండం కమిషనరేట్ పోలీసులు మంచిర్యాల జిల్లా భీమారం పరిధిలో మూడు రోజుల వ్యవధిలోనే పట్టుకున్నారు.
ఈ నెల 6న మొదటిసారి పట్టుబడిన నాగేశ్వర్రావు వద్ద గుంటూరు నుంచి తెస్తున్న క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. అలాగే, ఈ నెల 9న రెండోసారి పట్టుబడినపుడు కర్నూల్ జిల్లా నుంచి తెస్తున్న పత్తి విత్తనాలతో పట్టుబడ్డాడు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పట్టుబడిన నాగేశ్వర్రావును మొదటిసారి పట్టుకుని కఠినంగా శిక్షించినట్లయితే రెండోసారి పట్టుబడే వాడు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎంత సమర్ధవంతంగా పనిచేస్తున్నాయో ఈ ఉదంతమే నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల వ్యాపారం చేయాలంటేనే హడలి పోయిన కేటుగాళ్లు ఇపుడు యథేచ్ఛగా తమ వ్యాపారాలు సాగిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు..
నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు. నష్టం జరిగితే ఎవరూ బాధ్యత వహించరు. నకిలీ విత్తనాలపట్ల నిత్యం నిఘా పెడుతున్నాం. మా శాఖ అధికారులతోపాటు పోలీసు, రెవెన్యూ సహకారంతో మండల, వ్యవసాయ డివిజన్, జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల నకిలీ విత్తనాలను పట్టుకున్నాం. క్రిమినల్ కేసులు పెట్టి పోలీసులు కొందరిని జైలుకు పంపించారు. అయినా రైతులు అప్రమత్తంగా ఉంటేనే నకిలీ బెడదను అరికట్టవచ్చు. ఒకే బ్రాండ్ విత్తనాలు కావాలని కొన్ని కంపెనీలు మాయజాలం సృష్టిస్తున్నాయి. వీరి మాటలు నమ్మవద్దు. ఏ బ్రాండ్ అయినా సస్యరక్షణ చర్యలు సకాలంలో తీసుకుంటే ఆశించిన దిగుబడి వస్తుంది.
– బీ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి