రామడుగు, సెప్టెంబర్ 13: రైతులకు ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. మండలంలోని గోపాల్రావుపేటలో గల మన గ్రోమోర్ కేంద్రం వద్ద శనివారం యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పాసు పుస్తకంపై ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని, ఐదెకరాలకు ఏం సరిపోతుందని రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి నిరీక్షించేవారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ ఎరువుల కొరత రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు కనీసం రెండు బస్తాల చొప్పున యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.