జమ్మికుంట, డిసెంబర్ 18: గ్రామస్థాయిలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం జమ్మికుంట మండలంలో చర్చనీయాంశమైంది. పంచాయతీ నిధులపై ఆర్టీఐ ద్వారా ఓ అర్జీదారు అధికారులను సమాచారం కోరితే, గ్రామ పంచాయతీ విధుల్లో ఉండే కార్యదర్శి కాకుండా బదిలీ అయిన కార్యదర్శి సమాధానం ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం విమర్శలకు తావిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట మండలం నాగంపేట పంచాయతీ కార్యదర్శిగా శ్రీనివాస్ గతంలో పనిచేశాడు.
ఆయనపై అనేక ఆరోపణలు రాగా, జూలైలో బదిలీపై ఇల్లందకుంట మండలం సిరిసేడుకు వెళ్లాడు. సిరిసేడు కార్యదర్శి అంకూస్ నాగంపేటకు బదిలీపై వచ్చాడు. విధుల్లో చేరాడు. అయితే ఇదే సమయంలో నాగేశ్వర్రావు అనే వ్యక్తి నాగంపేట జీపీకి వచ్చిన నిధులు, ఖర్చులు, తదితర అంశాలపై ఆర్టీఐ చట్టం ద్వారా కలెక్టర్కు అర్జీ పెట్టి సమాచారం కోరాడు. కొద్ది రోజుల తర్వాత సదరు అర్జీ మండల ఎంపీవోకు వచ్చింది. ఎంపీవో వెంకటేశ్వర్లు కార్యదర్శికి పంపించాడు. నెలలు గడిచినా ఆర్టీఐ అర్జీదారుకు సమాధానం రాలేదు. దాంతో నాగేశ్వర్రావు ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు చేయగా, డీపీవో జోక్యం చేసుకొని సమాచారం ఇవ్వాలని అంకూస్ను ఆదేశించినట్లు తెలిసింది.
జూలై నుంచి జీపీ కార్యదర్శిగా అంకూస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నాడు. అయితే బదిలీపై వెళ్లిన శ్రీనివాస్ రంగంలో దిగాడు. తానే నాగంపేట కార్యదర్శినంటూ సిరిసేడు కార్యదర్శి శ్రీనివాస్ (గతంలో పనిచేసిన సెక్రటరీ)సెప్టెంబర్ 5న ఆర్టీఐ అర్జీదారు నాగేశ్వర్రావుకు జీపీ స్టాంపుతో ఓ లేఖ రాశాడు. ‘మీరు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు అడిగారు. మీకు జిరాక్సు పత్రాలు ఇవ్వాలంటే 10వేలకు పైగా చెల్లించాలి’ అని అందులో పేర్కొన్నాడు. ఈ సమాధానానికి అర్జీదారు అవాక్కయ్యాడు. ఈ లేఖ కార్యదర్శి అంకూస్ ఇవ్వాల్సి ఉండగా, శ్రీనివాస్ ఇవ్వడమేంటని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అర్జీ పెట్టి నెలలకు గడిచినా సమాచారం ఇవ్వలేదని, సమాచార హక్కు చట్టం ప్రకారం గడువు దాటిన తర్వాత ఉచితంగా సమాచారం పత్రాలు ఇవ్వాలంటూ, దరఖాస్తుదారుడు రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించాడు. ఇదిలా ఉండగా నాగంపేట కార్యదర్శి అంకూసా..? శ్రీనివాసా..? ఎవరు పనిచేస్తున్నారు? అధికారులు సపోర్టు ఎంత? అనేక సందేహాలున్నాయి.
పంచాయతీ కార్యదర్శి ఎవరు? తప్పుడు సమాధానాలు.. తదితర అంశాలపై అధికారులను ‘నమస్తే’ వివరణ కోరింది. అయితే ‘కార్యదర్శిని నేనే. అర్జీ వచ్చింది. రికార్డులు నాకు పాత కార్యదర్శి అప్పగించలే. ఆర్టీఐ సమాధానం మాత్రం శ్రీనివాస్ ఇచ్చాడు’ అంటూ తడబడుకుంటూ అంకూస్ సమాధానం చెప్పాడు. ఇక ఇదే విషయాన్ని ఎంపీడీవో భీమేశ్, ఎంపీవో వెంకటేశ్వర్లును అడిగితే.. అలా ఒక కార్యదర్శికి బదులు మరో కార్యదర్శి సమాధానం ఇవ్వడం తప్పేనని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు.