Koluvula Kirtana | చిగురుమామిడి, సెప్టెంబర్ 29: నిరుపేద కుటుంబంలో జన్మించి అనేక కష్టాలను ఎదుర్కొంటూ చదువుపై మక్కువతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకొని మండలంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి సంపత్-సరోజన దంపతుల కుమార్తె గ్రూప్-1 లో ఎంపీడీవో గా ఉద్యోగం సాధించారు. తండ్రి సంపత్ ఫొటోగ్రాఫర్ గా తల్లి చౌక ధరల దుకాణం (రేషన్ షాప్) తోపాటు కుట్టు మిషన్ కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కుమార్తె బింగి కీర్తనకు చదువుపై మక్కువ ఉండటంతో ఎంబీబీఎస్ సాధించి బీడీఎస్ దంతవైద్యలుగా ప్రాక్టీస్ చేశారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.
తల్లి సరోజనకు కాలు ప్రమాదం జరగడంతో రెండు సంవత్సరాలు ఇంటి వద్దనే ఉంటూ ఆన్లైన్లో అన్ని గ్రూపు పరీక్షలకు ప్రిపేర్ అయింది. పట్టుదలతో గ్రూప్-4 లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించి హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం పొందింది. గ్రూప్-3 లో అర్హత సాధించింది. గ్రూప్-2లో 1104 ర్యాంకుతో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సాధించారు. అలాగే గ్రూప్-1 లో అర్హత సాధించి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. గ్రామీణ కుటుంబ నేపథ్యం కలిగిన ‘కొలువుల కీర్తన’ ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ పట్టుదలతో నాలుగు ఉద్యోగాలు సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కీర్తనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.