Helth camp | ధర్మారం, మే 4 : ధర్మారం మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్ లో ఆదివారం కరీంనగర్ మెడికవర్ దవాఖాన ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సంజీవని ఆసుపత్రి 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నూతన భవనంలో మొదటి వార్షికోత్సవం జరుపుతున్న తరుణంలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో గుండె సంబంధిత పరీక్షలైన 2డి ఈకో, ఈసీజీతో పాటు కడుపునొప్పి, పైల్స్, ఫిస్టులా, అపెండిక్స్, కడుపులో గడ్డలు, బీపీ, షుగర్ కు గుండె వైద్య నిపుణులు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ సర్జన్ డాక్టర్ రాజేష్ కుమార్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రశాంత్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి 200 మంది రోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.
వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ముందస్తుగా రోగనిర్ధారణ జరగడంతోపాటు జాగ్రత్తల గురించి డాక్టర్ అవగాహన కల్పించారు. అవసరమైన వారికి సర్జరీలు కూడా ఆరోగ్యశ్రీలో చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సంజీవని హాస్పిటల్ డాక్టర్ ప్రశాంత్, ప్రతినిధి ఎండి హఫీజ్, ల్యాబ్ టెక్నీషియన్ సత్యం, కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.