గంగాధర, జూలై 19: అక్కా బావలే ఆమె పాలిట కాలయములయ్యారు. ఆరుగుంటల భూమి కోసం చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఈ నెల 15న జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన చిందం మాధవి(23) ఈ నెల 15న ఇంట్లో చున్నీతో ఉరేసుకుని మృతిచెంది ఉండగా, ఆమె మేనమామ సిరిమల్లె రాజేశ్ ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మాధవి మరో యువకుడితో చనువుగా ఉండడం, వారి కుటుంబం పేరిట ఉన్న 12 గుంటల్లో ఆరు గుంటల భూమిని పంచి ఇవ్వడం లేదని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన ఆమె అక్కాబావ గుండా ఆంజనేయులు, మానస కక్ష పెంచుకున్నారు.
మాధవిని చంపి 12 గుంటల భూమిని కాజేయాలని పథకం వేశారు. అనుకున్నట్లుగానే ఈ నెల 14న రాత్రి 9 గంటల సమయంలో ఆంజనేయులు నుస్తులాపూర్ నుంచి గర్శకుర్తికి వచ్చాడు. ఇంట్లో మాధవి ఒక్కతే ఉన్నదని తెలుసుకుని భూమి, కుటుంబ తగాదాల విషయంలో గొడవపడ్డాడు. చున్నీతో ఉరివేసి హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకున్నట్టు వేలాడదీసి నుస్తులాపూర్‌కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని భార్య మానసకు వివరించాడు. తర్వాత ఏమీ ఎరగనట్లు మాధవి చనిపోయిన విషయాన్ని తెలుసుకుని గర్శకుర్తికి వచ్చామని అందరికీ చెబుతూ నటించారు. కాగా, అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు తమదైన రీతిలో విచారణ చేయగా అక్కాబావలే హంతకులుగా తేలింది. పథకం ప్రకారం మాధవిని హత్య చేసిన గుండా ఆంజనేయులు, హత్యకు ప్రోత్సహించిన గుండా మానసను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచినట్లు చొప్పదండి సీఐ ప్రకాశ్‌గౌడ్ తెలిపారు.