గంగాధర, ఏప్రిల్ 10: రోడ్డు ప్రమాదంతో ఆటోలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అక్రమంగా తరలిస్తున్న 600 జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. ఎస్ఐ వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఆర్టీసీ బస్సు (టీఎస్ 02 టీ 1770).. కరీంనగర్ వైపు వెళ్తున్న ఆటో (ఏపీ36 టీబీ 5246/ ఏపీ36 డబ్ల్యూ 6231 నంబ ర్లు ఫేక్) గంగాధర మండలం మధురానగర్ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం ఢీకొన్నాయి.
బస్సు ముందు భాగం డ్యామేజీ కాగా, కాగా ఆటో డ్రైవర్ పారిపోయాడు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు గంగాధర పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆటోను తనిఖీ చేయగా అందులో కాటన్ బాక్స్, రెండు సంచుల్లో 600 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు డికార్ట్ వైర్ బెండల్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 12,500 వరకు ఉంటుందని చెప్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. గుర్తు తెలియని ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.