మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్‌క్వాస్ సర్టిఫికెట్లు అందజేసిన కేంద్రం, తాజాగా మరో రెండు కేంద్రాలు ఎంపికయ్యే అవకాశమున్నదని యంత్రాంగం చెబుతున్నది.
రాజన్న సిరిసిల్ల, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో వైద్య సేవలే కాకుండా మౌలిక సౌకర్యాలుంటేనే ఎన్‌క్వాస్ సర్టిఫికెట్ గుర్తింపు వచ్చే చాన్స్ ఉండగా, గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా ఏరియా దవాఖానల్లో ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ క్రమంలో నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను చేరుకున్నందుకుగాను ఇటీవలే జిల్లాలో కోనరావుపేట, బోయినపల్లి, విలాసాగర్, తంగళ్లపల్లి, నేరెళ్ల, కొదురుపాక, సిరిసిల్ల అర్బన్‌లో పీఎస్‌నగర్ ఆరోగ్య కేంద్రాలు ఎన్‌క్వాస్ సర్టిఫికెట్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్‌క్వాస్ సర్టిఫికెట్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవలే అందించింది. అయితే సర్టిఫికెట్తో ఒక్కో సెంటర్‌కు ఏడాదికి 3లక్షల చొప్పున మూడేళ్లపాటు 9లక్షల ప్రోత్సాహక నిధులు రానున్నాయి.
ఈ నిధులతో ఆయా దవాఖానల్లో మరిన్ని వసతులు సమకూర్చుకునే అవకాశం రాగా, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గంభీరావుపేట మండలం లింగన్నపేట, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట పీహెచ్‌సీలకు కేంద్రం సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉన్నదని, ఈ మేరకు సంకేతాలు అందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
మెరుగైన వైద్యం, నాణ్యతా ప్రమాణాల్లో జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి సంపూర్ణ సహకారం వల్లే ఏడు సెంటర్లకు ఎన్‌క్వాస్ సర్టిఫికెట్లు వచ్చాయి. అంతేకాదు ఒక్కో సెంటర్‌కు 9 లక్షల ప్రోత్సాహక నిధులు రానుండగా, వాటితో మరిన్ని వసతులు కల్పించుకోవచ్చు. అయితే కొత్తగా గంభీరావుపేట మండలం లింగన్నపేట, వేములవాడ రూరల్ మండలం హన్మాజీ పేట పీహెచ్‌సీలకు సర్టిఫికెట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది.
– డాక్టర్ సుమన్ మోహన్‌రావు, డీఎంహెచ్‌వో (రాజన్న సిరిసిల్ల)