కార్పొరేషన్, ఏఫ్రిల్ 05: కరీంనగర్ శాతవాహన అర్బన్ అథారిటీకి (SUDA) సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమయింది. 2041 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశారు. అమృత్ స్కీమ్ గైడ్‌లైన్స్, అర్బన్ డెవలప్మెంట ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ (UDPFI) మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేశారు. సుడా పరిధిలో 62 గ్రామాల్లోని 622 చదరపు కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకొని ఆయా గ్రామాల పరిస్థితులు, పట్టణాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి గత నెల 29న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలను స్వీకరించేందుకు 90 రోజుల గడువును కేటాయించారు.
సుడా పరిధిలోని అన్ని గ్రామాలను రెసిడెన్షియల్, అర్బనైజేషన్గా పేర్కొనడంతో పాటు, సుడా విస్తీర్ణం చుట్టు రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపుల పూర్తిగా కమర్షియల్ ఏరియా ప్రతిపాదించారు. వీటితో పాటుగా సుడా పరిధిలో 2289 హెక్టార్లను ఇండస్ట్రియల్ జోన్‌గా మార్చారు. నగరపాలక సంస్థ చుట్టు ఉన్న గ్రామాలను రెసిడెన్షియల్ ఏరియాగా ప్రతిపాదించగా.. సుడా చుట్టు ఉన్న గ్రామాలను అర్బనైజేషన్ ఏరియాలుగా ప్రతిపాదించారు. వీటితో పాటుగా 20 గ్రామాలను కలుపుతూ కొత్తగా రింగ్ రోడ్డు కోసం అధికారులు ఈ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదనలు చేశారు. సుడా పరిధి అంత అర్బనైజేషన్ సుడా పరిధిలోకి వచ్చే గ్రామాల్లో అత్యధికంగా రెసిడెన్షియల్ జోన్‌గా, మిగిలిన ప్రాంతాలన్ని అర్బనైజేషన్ జోన్‌గా పేర్కొన్నారు.
కొలిమికుంటలో కొంత ఏరియా, రుక్మాపూర్, జూబ్లీనగర్, మద్దనూర్, ఇరుకుల్ల, అన్నారం, మన్నెపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి కొంత ఏరియా, నేదునూర్, రేణికుంట, పరవెల్ల, మైలారం గ్రామాలను అర్బన్ జోన్‌గా ప్రతిపాదించగా… నగరంలో విలీనం అయిన దుర్శెడ్, మల్కాపూర్, గోపాల్పూర్, చింతకుంట గ్రామాలను, మానకొండూర్, తిమ్మాపూర్, ఈదులగుట్టపల్లి, పోరండ్ల గ్రామాలను రెసిడెన్షియల్ ఏరియాగా గుర్తించారు. సుడాకు నలువైపుల ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం రెండు వైపుల మాత్రమే ఇండిస్ట్రియల్ జోన్లను గుర్తించారు. అసిఫ్‌నగర్, ఒద్యారం, నాగులమల్యాల కొంత భాగం, ఎలగందుల, బద్దిపల్లి ప్రాంతాలను, మానకొండూర్ వైపు చెంజర్ల కొంత భాగాన్ని ఇండస్ట్రియల్ ఏరియాలుగా గుర్తించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలోని ప్రదాన రోడ్లకు ఇరువైపుల ఉన్న ప్రాంతాలను పూర్తిగా కమర్షియల్ జోన్లుగా గుర్తించారు. నగరానికి చుట్టు ఉన్న రేకుర్తి వరకు, మానకొండూర్ వరకు, అల్గునూర్ చివరి వరకు, చింతకుంట వరకు ఉన్న ప్రధాన రోడ్ల ఇరువైపుల కమర్షియల్ ఏరియాగా పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రధాన రోడ్లను మిక్స్డ్ జోన్లుగా ప్రతిపాదించారు. వీటితో ఆయా గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించాలని ఆదిలో ప్రతిపాదించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ముందు జాగ్రత్తగా ఎక్కడ కూడ రోడ్ల విస్తరణ విషయంలో అధికారులు దృష్టి సారించలేదు. కరీంనగర్లో మాత్రం అనేక ప్రాంతాల్లో భారీగానే మార్పులు జరిగాయి. ముఖ్యంగా సుడా మాస్టర్ ప్లాన్ విషయంలో పెద్ద ఎత్తున్న ప్రచారం చేయాల్సి ఉన్నా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు.
సుడా చుట్టు రింగ్‌రోడ్డుకు ప్రతిపాదన భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కరీంనగర్‌కు కూడ అధికారులు 200 ఫీట్ల విస్తర్ణంతో రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. సుమారుగా 138 కిలోమీటర్ల పొడవైన రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. జగిత్యాల రోడ్డులో కొత్తపల్లి శివారు నుంచి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబొతారం, ఇరుకుల, దుర్శెడ్, బొమ్మకల్ మీదుగా మానకొండూర్, ముంజంపల్లి, పొరండ్ల మీదుగా నుస్తులాపూర్ వద్ద హైదరాబాద్ రాజీవ్ రహదారిని కలుపుతారు. రాజీవ్ రహదారి నుంచి గునుకుల కొండాపూర్, మదాపూర్, పారువెల్ల, ఒద్యారం, నాగులమల్యాల, వెలిచాల మీదుగా జగిత్యాల రోడ్డు వరకు కలుపుతూ రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. దీని వల్ల రవాణా వ్యవస్థ వేగంగా మారేందుకు అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెప్పుతున్నాయి.