కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే పరీక్షల నిర్వహణ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్య నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల అనేక డిగ్రీ కళాశాలలు అచేతన స్థితిలో ఉంటూ సుమారు 50 శాతానికి పైగా మూతపడ్డాయన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రభుత్వ విధానాల ద్వారా విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, యాజమాన్యాలపై మృత్యుగంటికలు మోగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించినప్పుడే పరీక్షలను నిర్వహించగలమని, ప్రభుత్వంలోని అన్ని శాఖలకు లేఖలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని చెప్పారు. కానీ, 14వ తేదీ నుంచి పరీక్షలు అని యూనివర్సిటీలు ఇచ్చిన షెడ్యూలు సాధ్యం కాదని, ప్రభుత్వం ఈ రెండు, మూడు రోజులలో స్పందించి కళాశాలల అకౌంట్లో బకాయిలు జమ చేస్తే పరీక్షల నిర్వహణ ఉంటుందని తేల్చిచెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.