గంగాధర, ఆగస్టు 23: ‘రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా అరిగోస పడుతున్నరు. సొసైటీలు, గ్రోమోరు సెంటర్ల వద్ద నిరీక్షిస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతులు చెప్పులు, ఆధార్‌కార్డులు లైన్లో పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి చీకటి రోజులను సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెచ్చాడు’ అని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎరువుల కొరతకు బీజేపీ, బీఆర్ఎస్సే కారణమని మంత్రి తుమ్మల, ఇక చెప్పులను లైన్లో పెట్టేది, రైతులను లైన్లలో నిలబెట్టేది బీఆర్ఎస్ నాయకులేనని మంత్రి పొన్నం మాట్లాడడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతుల బాధలకు కారణం వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తులు రాష్ర్టానికి సీఎం, మంత్రులుగా ఉండడమేనని విమర్శించారు. శనివారం మధురానగర్ చౌరస్తాలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడానికే ప్రభుత్వం కుట్రపూరితంగా కృతిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. రేవంత్‌కు ఢిల్లీకి మూటలు పంపడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రైతు సమస్యలపై సోయిలేదనర్నారు. చెరువు నీళ్లు చెరువెనుక పడ్డంక యూరియా తెప్పిస్తమని చెప్పడం హాస్యాస్పదమాన్నారు. కేసీఆర్ హయాంలో జనవరి, ఫిబ్రవరి మాసంలోనే కేంద్రంతో మాట్లాడి రైతులకు కొరత లేకుండా తీసుకువచ్చారని గుర్తు చేశారు.
రోజంతా లైన్లో నిలుచున్నా యూరియా అందకపోవడంతో కడుపుమండి రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమన్నారు. ఎరువుల కోసం రైతులు నిరసన తెలిపితే పోలీసులతో లాఠీ చార్జీలు చేయించి, గల్లాపట్టి ఈడ్చుకువెళ్లడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేస్తున్న పాదయాత్ర జనహిత పాదయాత్ర కాదని, అది జనహింస పాదయాత్ర అని ఎద్దేవా చేశారు.
ఏం చేశారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని పాదయాత్రలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొరత లేకుండా యూరియా అందించాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.