మానకొండూర్/ కొత్తపల్లి, సెప్టెంబర్ 15 : వినాయక నిమజ్జనోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు. భక్తులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా, శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో సమస్యలు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా, కరీంనగర్ జిల్లా మానకొండూర్ చెరువు వద్ద ఏర్పాట్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని భక్తులకు సూచించారు.
కరీంనగర్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనం సజావుగా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం కొత్తపల్లి మండలంలోని చింతకుంట కెనాల్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మేయర్ వై సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. కెనాల్లో నీటి నిలువ తక్కువగా ఉండడంతో మరిన్ని విడుదల చేయాలని ఇంజినీరింగ్ అధికారికి సూచించారు. చింతకుంట కెనాల్‌తో పాటు కొత్తపల్లి చెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే, కొత్తపల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజుతో కలిసి పరిశీలించారు. ఆయా చోట్ల మున్సిపల్ కమిషనర్ చాహత్ భాజ్‌పాయ్, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో రవీందర్, డీఎంహెచ్‌వో సుజాత పాల్గొన్నారు.