లోక్‌సభ సమరానికి సర్వం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాల పరిధిలో ఎన్నికలకు యంత్రాంగం రెడీ అయింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీల పరిధిలో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ జరుగనుండగా, ఇందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. మొత్తంగా 4044 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సిబ్బందిని ఆదివారమే పంపింది. ఆయా శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసింది. ఈ రెండు పార్లమెంట్ స్థానాలకు 70 మంది అభ్యర్థులు బరిలోకి దిగగా, కరీంనగర్లో 17,97,150, పెద్దపల్లిలో 15,96,430 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 20 వేల మంది సిబ్బంది, అధికారులు విధులు నిర్వహిస్తుండగా, వేలాది మంది పోలీసులు బందోబస్తులో తలమునకలయ్యారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సోమవారం ఉదయం 5 గంటలకు ఏజెంట్లను కేంద్రాల్లోకి అనుమతించి, 5.30 గంటలకు మాక్‌పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అనంతరం కంట్రోల్ యూనిట్‌లోని మెమొరీ డిలీట్ చేసి, వీవీ ప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులు తొలగించిన తర్వాత ఓటింగ్‌కు సిద్ధం చేస్తారు. ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభించి, సాయంత్రం ఆరు గంటలకు ముగించనున్నారు. పోలింగ్ ముగియగానే ఈవీఎం యంత్రాలను సీల్ చేసి పంపిణీ చేసిన కేంద్రాల్లోకి తెచ్చి తిరిగి అప్పగించేలా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది.
రెండు పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, ప్రతి అసెంబ్లీ పరిధిలో 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, పీడబ్ల్యూడీ, యువత కోసం ఒక్కో సెంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఇంకా మోడల్ పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. యువత కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో యువ అధికారులు, మహిళా కేంద్రాల్లో మహిళా అధికారులు, పీడబ్ల్యూడీ కేంద్రాల్లో అంగవైకల్యం గల అధికారులు విధులు నిర్వహించనున్నారు. మోడ్రన్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, మరుగుదొడ్లు, బాత్రూంలతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల సంఘం ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే 144వ సెక్షన్ విధించింది. సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా కరీంనగర్లో 2500 మంది, పెద్దపల్లిలో 3,300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన బెటాలియన్ పోలీసులు కూడా ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యేలా ఈసీ చర్యలు తీసుకున్నది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇది కొనసాగనుండగా, పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరిస్తున్నారు. పోలింగ్ ముగిసే వరకు కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఓటర్లు మినహా ఎవరూ రాకూడదని ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ బూత్ ఎదుట ఓటేసేందుకు క్యూ కట్టిన వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు పోలింగ్ కొనసాగనుండగా, ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా కరీంనగర్, పెద్దపల్లి రిటర్నింగ్ అధికారులు పమేలా సత్పతి, ముజామ్మిల్‌ఖాన్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలకు ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ జరగనుండగా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పెద్దపల్లి పార్లమెంట్‌లోని మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ అసెంబ్లీల పరిధిలో మాత్రం 4 గంటల కల్లా ముగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎంపిక చేసిన సిబ్బందికి ఆదివారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ కేంద్రాలు కేటాయించి, పోలింగ్ సామగ్రి అప్పగించారు.
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి పర్యవేక్షణలో సిబ్బందికి సామగ్రి అప్పగించారు. మొత్తం 215 రూట్లుగా విభజించి, సంబంధిత రూటు అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల సిబ్బంది, సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కరీంనగర్ సెగ్మెంట్ పరిధిలో 17,97,150 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 9,19,565 మంది మహిళలు, 8,77,483 మంది పురుషులు, 102 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2,194 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల యంత్రాంగం ఏర్పాటు చేసింది. మొత్తం 13,176 మంది సిబ్బందికి పోలింగ్ నిర్వహణకు వినియోగించుకునేందుకు విధులు కేటాయించింది. ఓటర్లు ఓటేసేందుకు వీలుగా పార్లమెంటు పరిధిలో మొత్తం 2,740 ఈవీఎంలు సేవలందించనున్నాయి. వీటిలో 5,500 బ్యాలెట్ యూనిట్లు, 2,743 కంట్రోల్ యూనిట్లు, 3,077 వీవీ ప్యాట్లు, అదనంగా రిజర్వు చేసిన వాటితో కలిపి ఉన్నాయి.
వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, ఉక్కపోతను తట్టుకునేలా కూలర్లు, ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ బరిలో 28 మంది, పెద్దపల్లి బరిలో 42 అభ్యర్థులతో పాటు నోటా కూడా ఉండడంతో, ఒక్కో పోలింగ్ బూతులో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. హోం ఓటింగ్‌లో పాల్గొనని వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలను ఎన్నికల యంత్రాంగం కల్పించింది. పోలింగ్ కేంద్రాలకు వీరిని తరలించేందుకు ప్రత్యేకంగా ప్రతి కేంద్రంలో ఒక ఆటో ఏర్పాటు చేశారు. అలాగే, కేంద్రంలోకి తీసుకెళ్లి, ఓటేసిన అనంతరం తిరిగి ఆటోలో ఇంటి వద్దకు చేర్చేందుకు ప్రత్యేకంగా వలంటీర్లను నియమించారు. ట్రైసైకిళ్లు కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోగా, పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు అనువుగా ర్యాంపులు కూడా సిద్ధం చేశారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిలో ముద్రించిన బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ యూనిట్లకు ఎన్నికల యంత్రాంగం అతికించింది.
కరీంనగర్లో సమస్యాత్మకంగా ఉన్న 1012, పెద్దపల్లి స్థానం పరిధిలో 1259 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న చోట బయటి పరిసరాలు కూడా వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు ప్రకటించారు. మిగతా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్లు, ఫోన్లు, ట్యాబులు, ల్యాప్‌టాప్‌లతో పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. ఈ డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు పంపనున్నారు.