World Diabetes Day | పెద్దపల్లి రూరల్ నవంబర్ 14 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి బీ వాణీ శ్రీ అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం (World Diabetes Day) సందర్భంగా..పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్, రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మధుమేహం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ..మధుమేహం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
“ఆరోగ్యకరమైన రేపటి కోసం-కలిసికట్టుగా అవగాహన, కార్యాచరణతో మధుమేహాన్ని జయించుదాం” అన్న నినాదంతో, మధుమేహ నియంత్రణ, నివారణ చికిత్సపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. జనాభా మొత్తం ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించేందుకు మధుమేహంపై సమగ్ర జాగ్రత్తలు, సరైన ఆహారపు అలవాట్లు, నియమిత వ్యాయామం, కాలానుగుణ ఆరోగ్య పరీక్షలు అత్యంత కీలకమన్నారు.
అలాగే అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దావఖానాల్లో ఉచితంగా మధుమేహ పరీక్షలు నిర్వహించబడుతున్నాయన్నారు. మధుమేహం నిర్ధారణ అయిన వారికి తగిన మందులు ఉచితంగా అందించబడతాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు రాజమౌళి, శ్రీరాములు, కె.వి. సుధాకర్ రెడ్డి, లక్ష్మీ భవానీ, శ్రవణ్ కుమార్, మమత, జిల్లా NCD కోఆర్డినేటర్ టీ రాజేశం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.