Child marriages | పెద్దపల్లిరూరల్, నవంబర్ 3 : బాల్య వివాహాలను నిరోధించే విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జీ కే స్వప్న రాణి అన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులతో సోమవారం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న రాణి మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బాల్య వివాహా నిషేధ చట్టం-2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహం చేసుకున్నట్లయితే వాటి వల్ల కలిగే మానసిక, శారీరక, ఆర్థిక అనర్థాలను వివరించారు. ఆడపిల్ల పుట్టడం బతకడం, ఎదగడం, చదవడం దాని నినాదాన్ని పిల్లలచే ప్రతిజ్ఞ చేయించారు. హెల్ప్ లైన్ నంబర్స్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ సుచరిత, అకౌంటెంట్ సమత, సఖి కేంద్రం కో-ఆర్డినేటర్ దారవేన స్వప్న యాదవ్, ఐసీపీఎస్ పీవో ఎన్ఐ కనకరాజు, నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, పోలీసులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.