Collector Koya Sri Harsha | పాలకుర్తి : ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చూడాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య అందించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. పాలకుర్తి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలు, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం సందర్శించారు. పాఠశాలల్లో ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ ప్రసవాలను పెంచాలని, అలాగే బీపీ, షుగర్ ఇతర వ్యాధుల కోసం వస్తున్నటువంటి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలని చెప్పారు. మండలంలోని కొత్తపెళ్లి, రామారావు పల్లి, పుట్నూరు, కేజీబీవీ, జయ్యారం, కన్నల జిల్లా పరిషత్ పాఠశాలలను సైతం ఆయన సందర్శించారు.
మండలంలోని అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. కొత్తపెళ్లి ఎంపీ యూపీఎస్ లో అదనంగా వాషింగ్ బేసిన్, వాష్ రూంలో ఇంటర్ లాకింగ్ టైల్స్ వెయ్యాలని ఆదేశించారు. జయారం జెడ్పీహెచ్ఎస్ లో గ్రౌండ్ లెవెలింగ్, నూతనంగా స్టేజి నిర్మాణానికి ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఎస్సీ హాస్టల్, పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంజూరు చేసిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎస్సీ హాస్టల్ కు అదనపు డార్మెటరీ డైనింగ్ హాల్ త్వరగా పూర్తిచేయాలని అన్నారు. జయారం గ్రామపంచాయతీని తాత్కాలికంగా పాఠశాలలో అదనపు తరగతిగలు మార్చుకోవాలని గ్రామపంచాయతీ భవనం పూర్తిగా హాస్టల్కే గదులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరగాలని 400 నుంచి 600 చదరపు గజాల లోపు ఇంటి నిర్మాణం ఉండాలని అధికారులను ఆదేశించారు.
పర్యటనలో కలెక్టర్ వెంట ఎంపీడీవో రామ్మోహన చారి, మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్, మండల విద్యాధికారిని విమల, హౌసింగ్ డిఈ దస్తగిరి, ఎంపీవో సుదర్శన్, వైద్యాధికారులు సాయి సూర్య, మారుతి, కేజీబీవీ ప్రత్యేక అధికారిని డి స్వరూప, పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.