Evening school | కోల్ సిటీ , మార్చి 29 : పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు. 50 యేళ్ల లోపు మహిళల జీవన స్థితిగతులను మెరుగుపర్చడం కోసం నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు త్వరలో సొంత ఖర్చులతో వయోజన విద్య కేంద్రం ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ఈ మేరకు నగర పాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్లో మహిళలకు అక్షరాస్యత పరీక్షలను నిర్వహించారు. మెప్మా సీవో శమంతక మణితో కలిసి కార్పొరేటర్ పర్యవేక్షించి మాట్లాడారు. నగర పాలక సంస్థలో తమ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే వయోజన విద్య కేంద్రంను ఏర్పాటు చేయిస్తానని. పేర్కొన్నారు. ఒక పాఠశాలను ఏర్పాటు చేసి సాయంత్రం వేళలో నిరక్షరాస్యులైన మహిళలకు చదువు నేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డివిజన్ అభివృద్ధి చెందాలంటే మహిళలు అక్షరాస్యత శాతం పెరగాలని అందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు స్వర్ణలత, సరోజ, సుశీల, సభ్యులు దేవలక్ష్మీ, రాధా, ప్రమీల, సురేఖ, కళావతి, లక్ష్మీ, పోచమ్మ, సమ్మక్క, మంజుల తదితరులు పాల్గొన్నారు.