Godavarikhani | కోల్ సిటీ, మార్చి 8 : మహిళలు అంతరిక్షంలో అడుగిడే స్థాయికి ఎదిగినా అవనిపై మాత్రం ఇప్పటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఐలు రాష్ట్ర కన్వీనర్, సీనియర్ న్యాయవాది సీహెచ్ శైలజ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని శ్రామిక భవన్లో ఐద్వా, సీఐటీయూ, ఏఐకేఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
ఐలు కన్వీనర్ శైలజ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. రాజకీయ పార్టీలు సమాజం మద్ధతుతో విద్య, వైద్యం, మహిళా భద్రతపై సమర్థవంతమైన చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెరిగినా మహిళలపై అఘాయిత్యాలు, ఆదిపత్యం తగ్గడం లేదన్నరు. పాలకులు మహిళా దినోత్సవంను ఒక వేడుకగా మాత్రమే చూస్తున్నారనీ, దాని వెనుక ఉన్న గొప్ప పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటాల్సిన అవసరం ఉందన్నారు. సావిత్రి బాయి పూలే, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి ఎంతోమంది వీర వనితలను స్పూర్తిగా తీసుకొని మహిళల హక్కులకై సమష్టిగా పోరాడాలన్నారు.
మహిళలు అంతరిక్షంలో అడుగుపెట్టినా అవనిపై ఇంకా వివక్షతకు గురవుతున్నారనీ, మహిళా భాగస్వామ్యం లేనిదే ఏ దేశం అభివృద్ధి చెందలేదన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలల్లో వాటిపై అవగాహన లేకపోవడం వల్లనే దాడులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఏమహేశ్వరి అధ్యక్షతన జరిగిన సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఏ. జ్యోతి, కుమారస్వామి, భాగ్యలక్ష్మీ, శివకుమార్, అనూష, సృజన, మణెమ్మతోపాటు అధిక సంక్యలో మహిళలు పాల్గొన్నారు.