కొడిమ్యాల, జూలై 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటుదామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని, అన్యాయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండాలన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కేసులు, వేధింపులకు భయపడవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా పార్టీ లీగల్ సెల్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కొడిమ్యాల మండలంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నుంచి మాజీ ప్రజా ప్రతినిధులు బల్కం మల్లేశం, సురుగు శ్రీనివాస్, సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, అక్కపల్లి రాజేశం, గుగులోత్ శంకర్‌నాయక్, ఎలగుర్తి రవీందర్, నేరెళ్ల మహేశ్‌తో పాటు 300 మంది సోమవారం బీఆర్ఎస్లో చేరగా, వారికి వినోద్‌కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ఆ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పొందుపరచాలని, అప్పుడు సుప్రీం, హైకోర్టులు ఆపలేవని తెలిపారు. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తలుచుకుంటే 24 గంటల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉన్నా రిజర్వేషన్లపై మాట్లాడలేని దద్దమ్మలు అని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు ముందు రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవుపలికారు. రిజర్వేషన్ల విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడంతో గతంలో ముందుకు వెళ్లలేదని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒక్కరే అని గుర్తు చేశారు.
మహిళలకు మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల ప్రకారం చోటు కల్పించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కోట్ల రూపాయల నష్ట్రం జరుగుతున్నదని, గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 1800 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మున్సిపల్, జిల్లా పరిషత్‌లకు 3 కోట్ల నుంచి 4 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. 2027 తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని, నియోజకవర్గాల పునర్విభజన జరగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు, మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కోరండ్ల నరేందర్‌రెడ్డి, జనగాం శ్రీనివాస్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు తదితరులున్నారు.
రైతులపై రేవంత్‌కు ప్రేమ లేదు
రేవంత్‌రెడ్డి సర్కారుకు రైతులపై ప్రేమలేదు. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గోదావరి నీళ్లు వృథాగా వెళ్లి సముద్రంలో కలుస్తున్నాయి. గ్రామాల్లోనేమో నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. వృథాగా వెళ్లే నీటితో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులను నింపుకొనే అవకాశం ఉన్నది. కానీ, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగాయన్న కారణం చూపించి నీళ్లన్నీ సముద్రంపాలు చేస్తున్నది.
– వినోద్ కుమార్
రేవంత్ సమైక్య పాలన కోరుకుంటున్నారు
ఆంధ్రా సీఎం చంద్రబాబుతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ సమైక్య పాలనను కోరుకుంటున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి పరోక్షంగా ఆంధ్రాకు సహకరిస్తున్నారు. గ్రామాల్లో రైతులు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు సంచులు మోయడానికి పని చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 200 కోట్లతో కొడిమ్యాల మండలంలో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఒక్క రూపాయి తేలేదు. నాచుపల్లి వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం బీఆర్ఎస్ హయాంలో పూర్తయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రారంభించడం సిగ్గు చేటు.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
ఎన్నికల కోసమే కాంగ్రెస్ పథకాలు
రేవంత్‌రెడ్డి కేవలం ఎన్నికల కోసమే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్లు ఎన్నికల స్టంట్లే. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదు. పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో రాష్టాన్ని ఇరవై ఏండ్లు వెనక్కి తీసుకెళ్లింది.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు,
బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు